MODI INDEPENDENCE DAY SPEECH: భారత గడ్డపై ఉన్న మట్టిలో శక్తి ఉందని, ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశం ముందుకెళ్లకుండా ఆగేదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశం ఎవరికీ తలవంచదని, ముందుకు వెళ్తూనే ఉంటుందని నొక్కి చెప్పారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ.. అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశం ముందు ప్రస్తుతం అనేక సువర్ణ అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవ సంకల్పంతో, కొత్త దారుల్లో ప్రయాణించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
"భారతీయులందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. చిట్టచివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలన్న మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నాం. నిలబడదనుకున్న భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడింది. ప్రజాస్వామ్య దేశాలకు భారత్ ఒక మార్గదర్శిగా నిలిచింది. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలన్నీ ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రతిక్షణం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. సవాళ్లను ఎదుర్కొని దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నారు. "
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
వందల ఏళ్ల బానిసత్వంలో భారతీయతకు భంగం కలిగిందని మోదీ పేర్కొన్నారు. బానిసత్వంలో భారతీయత భావన గాయపడిందని చెప్పారు. 'స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్ నిలబడలేదు.. ముక్కలుచెక్కలవుతుందని చాలామంది అన్నారు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచింది. ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేసింది. ఆకలికేకలు, యుద్ధాలు, తీవ్రవాదం, అతివాదం వంటి సమస్యలకు భారత్ ఎదురొడ్డి నిలిచింది. ఆకలికేకల భారతం నేడు ఆహారధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుంది. వైజ్ఞానికరంగంంలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది. ఈ గౌరవం అకుంఠిత దీక్షతో పనిచేసిన ప్రతి పౌరుడికి దక్కుతుంది' అని మోదీ వివరించారు.
దేశం నలుమూలలా అభివృద్ధి కాంక్ష రగిలిపోతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ అమృతవేళ ఆకాంక్షలకు దారి చూపించే బాధ్యత మనపై ఉందన్నారు. 'ప్రపంచం భారతదేశాన్ని చూసే దృష్టి మారిపోయింది. భారత్ ఇవాళ సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోంది. ప్రపంచ ఆకాంక్షల సాకారానికి భారత్ సిద్ధంగా ఉంది. వచ్చే 25 ఏళ్లు పంచ ప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాటం చేయాలి. వచ్చే 25 ఏళ్లలో స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షలను సాకారం చేయాలి. సంపూర్ణ అభివృద్ధి మనముందు ఉన్న అతిపెద్ద సవాల్. మనలో ఏ మూలన దాగివున్న బానిస మనస్తత్వాన్ని తుదముట్టించాలి. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలి. 1.వికసిత భారతం, 2.బానిసత్వ నిర్మూలన, 3.వారసత్వం, 4.ఏకత్వం, 5.పౌర బాధ్యత ఇవే మన పంచప్రాణాలు' అని దేశప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ పేర్కొన్నారు.