PM Modi Goa Liberation Day: గోవా పర్యటనలో భాగంగా పనాజీలో నిర్వహించిన 'గోవా విముక్తి దినోత్సవం'లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మరికొద్దికాలం జీవించి ఉంటే గోవాకు ముందే స్వాతంత్య్రం వచ్చేదన్నారు మోదీ.
పోర్చుగల్ పాలనలో ఏళ్లపాటు మగ్గినా.. గోవా తన భారతీయతను కోల్పోలేదన్నారు మోదీ. ఈ క్రమంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు, పోరాట వీరులను కొనియాడారు.
"సుపరిపాలన, తలసరి ఆదాయం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ వసతి, ప్రతి ఇంటికీ నల్లా.. తదితర విభాగాల్లో గోవా అగ్రస్థానంలో ఉంది. గోవాలో అర్హులైన అందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు అందించినందుకు అధికారులకు కృతజ్ఞతలు. గోవా అభివృద్ధి కోసం సీఎం ప్రమోద్ సావంత్ శాయశక్తులా కృషిచేస్తున్నారు. గోవా అభివృద్ధిలో మాజీ సీఎం, దివంగత నేత మనోహర్ పారికర్ కృషి ఎంతగానో ఉంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు."
-- ప్రధాని నరేంద్ర మోదీ
మోదీ సత్కారం..
Modi On Goa Liberation day: గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా.. స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులకు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. అనంతరం.. సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. నౌకాదళ, వైమానిక విన్యాసాలను వీక్షించారు. పోర్చుగీసు నుంచి గోవా విముక్తి కోసం జరిగిన 'ఆపరేషన్ విజయ్'లో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట వీరులను సత్కరించారు. వారి సేవలను కొనియాడారు.
పోర్చుగీసు నుంచి గోవా విముక్తి చెందిన 1961నుంచి ఏటా డిసెంబరు 19న గోవా విముక్తి దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: దేశంలో 145కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో వ్యాప్తి