దేశంలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం భారత్‌ను ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మార్చేందుకు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని మోదీ దేశంలోనే తొలిసారి సోలార్ విద్యుత్ గ్రామంగా మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగానే మొధేరా దేశానికి తెలుసని.. ఇప్పుడు దేశ ప్రజలంతా దీన్ని సూర్య గ్రామంగానే గుర్తిస్తారన్నారు. ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు చెప్పారు.
మెహసానా ప్రజలు గతంలో నీళ్లు, విద్యుత్ కోసం ఎన్నో అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. మహిళలు నీళ్లకోసం చాలా దూరం నడవాల్సి వచ్చేదని తెలిపారు. కానీ ఇప్పటితరానికి ఆ బాధల్లేవన్నారు. మంచి ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యంతో పరిశ్రమలను స్థాపించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, కనెక్టివిటీని పెంచడం వంటివి చేయగలుగుతుందన్నారు. అప్పుడే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలుగుతామని చెప్పారు.
ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు!
గతంలో విద్యుత్ లేకపోవడంతో చదువు, ఇంటి పనులకు ఇబ్బందులు ఉండేవని.. ఇప్పుడు సౌర విద్యుత్ న్యూ ఇండియాను మరింత సాధికారత కల్పించేలా లక్ష్యాన్ని అధిగమించేలా చేస్తోందన్నారు. నీరు, విద్యుత్ లభ్యత; యువతకు విద్య, వృద్ధులకు వైద్య సదుపాయాలు; వ్యవసాయంలో మార్పులు; కనెక్టివిటీని పెంచేందుకు తగిన మౌలికవసతులు కల్పన.. ఈ స్తంభాలపై గుజరాత్‌ను అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సైకిళ్లను తయారు చేయలేని రోజుల నుంచి నేడు గుజరాత్ కార్లు, మెట్రోకోచ్‌లను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. త్వరలోనే గుజరాత్ విమానాలను తయారు చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదని మోదీ వ్యాఖ్యానించారు.