modi news: భూమికి హాని కలిగించకుండా దానికి అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పర్యావరణ హితం కోసం భారత్ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచడం వల్ల సింహాలు, పులులు, ఏనుగుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్(లైఫ్) మూవ్మెంట్' కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
" రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానాలను మన జీవితంలో భాగం చేసుకోవాలి. జీరో కార్బన్ జీవన విధానాన్ని అలవర్చుకోవాలని మహాత్మ గాంధీ పిలుపునిచ్చారు. మనకు భూమి ఒకటే ఉంది. కానీ మనం చేయడానికి అనేక ప్రయత్నాలు ఉన్నాయి"
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. ప్రపంచం వాతావరణ లక్ష్యాలను సాధించడానికి భారత్ నాయకత్వం వహిస్తుందన్నారు. గ్రీన్‌హౌజ్ గ్యాసెస్‌ను నిర్మూలించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. శిలాజేతర ఇంధన వనరుల నుంచి 40 శాతం విద్యుత్ సామర్థాన్ని స్థాపించాలనేది తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని పది శాతానికి పెంచామని చెప్పారు. 2013-14లో 1.5 శాతం ఉండగా.. 2019-20లో 5 శాతానికి చేరుకుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'భాజపావి నీచ రాజకీయాలు.. కశ్మీరీ పండిట్లకు రక్షణేదీ?'