ప్రభుత్వం చేసిన పనుల గురించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భాజపా ఎంపీలకు సూచించారు. సమాచార లోపం వల్ల విపక్షాల అసత్యాలు ప్రచారం కాకుండా చూసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే అసత్యాలను తిప్పికొట్టాలని సభ్యులకు నిర్దేశించారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ కనీసం విపక్ష పాత్రను సైతం సరిగ్గా నిర్వహించలేకపోతోందని ధ్వజమెత్తారు.
"ప్రజలు మనల్ని(భాజపాను) ఎంపిక చేసుకున్నారన్న వాస్తవాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. బంగాల్, అసోం ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పటికీ.. విపక్ష పార్టీ బాధ్యతలను కాంగ్రెస్ నిర్వర్తించడం లేదు. ప్రస్తుతం ఉన్న నిజమైన సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉన్నా.. విపక్షంగా కాంగ్రెస్ ఆ పనిచేయడం లేదు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కరోనా మహమ్మారి రాజకీయ సమస్య కాదని, మానవతా సమస్య అని ప్రధాని పేర్కొన్నారు. కరోనా సమయంలో దేశంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. కరోనా వ్యాప్తి మూడో దశ విషయంలో ఎంపీలంతా అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అవాంతరాలు లేకుండా తమతమ నియోజకవర్గాల్లో వ్యాక్సినేషన్ కొనసాగేలా చూసుకోవాలని చెప్పారు.
మరోవైపు, పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. విపక్షాలే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
ఇదీ చదవండి: పార్లమెంటులో 'పెగాసస్' రగడ - ఉభయ సభలు వాయిదా