కరోనా మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్నప్పటికీ.. రెండో దశ వైరస్ తుపానులా వ్యాపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలి కాలంలో ఎందరో ఆప్తులను కోల్పోయామని పేర్కొన్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.
కరోనా వ్యాప్తి నివారణకు నిపుణులతో సమావేశమయినట్లు మోదీ తెలిపారు. ఆక్సిజన్, ఫార్మా కంపెనీ ప్రతినిధులతోను చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. కరోనాపై ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు పెద్ద యుద్ధమే చేస్తున్నారని.. వారి సేవ చిరస్మరణీయమని అన్నారు.
కచ్చితమైన వనరుల నుంచే కరోనా వివరాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించిన ఆయన.. సామాజిక మాధ్యమాల్లో కరోనాపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. కొవిడ్ కట్టడికి రాష్ట్రాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం సహకరిస్తుందని అన్నారు.
వదంతులు నమ్మొద్దు..
" కొవిడ్ టీకాలపై వచ్చే వదంతులు నమ్మొద్దు. 45 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్రం ఉచితంగా టీకా ఇస్తోంది. అర్హులంతా ఉచిత టీకాను సద్వినియోగం చేసుకోవాలి. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకా తీసుకునే అవకాశం ఉంది."
--నరేంద్ర మోదీ, ప్రధాని.
అంబులెన్స్ డ్రైవర్లకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరులో డ్రైవర్ల సేవ అనిర్వచనీయమని ప్రశంసించారు. కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు టీకా వేయించాలని కోరారు. వీలైనంత ఎక్కువ మంది టీకా తీసుకునేలా రాష్ట్రాలు కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి:వారాంతపు లాక్డౌన్- రహదారులు నిర్మానుష్యం!