PM Kisan 15th Installment 2023 : తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే.. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద.. అన్నదాతలకు ఏడాదికి 6 వేల రూపాయలను అందిస్తోంది. అర్హులైన వారికి త్రైమాసికానికి ఒకసారి 2000 రూపాయల చొప్పున విడుదల చేస్తోంది. ఇప్పటి వరకూ 14 విడతలుగా సొమ్మును రైతుల ఖాతాల్లో వేసిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు 15వ సారి నగదు అకౌంట్లో జమ చేసేందుకు సిద్ధమైంది.
కరువు కాటకాలు, ఇతర ప్రకృతి వైపరిత్యాలతో రైతులు చేస్తున్న వ్యవసాయం ఒకవిధమైన జూదంగా మారిపోయిందనే చెప్పాలి. మొక్క దశనుంచి మొదలై.. చివరకు పంట చేతికి వచ్చే సమయానికి కూడా నేలపాలైపోయే పరిస్థితులు ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు కాసింత ఆసరా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి(PM Kisan Installment 2023) ని తీసుకొచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ పథకాన్ని అందిస్తోంది.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అల్పాదాయ వర్గాలకు చెందిన సుమారు 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 2023 ఏప్రిల్-మే త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు బ్యాంకులో జమ కావాల్సి ఉంది. వీటిని త్వరలోనే రైతుల ఖాతాల్లో వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ 15వ కిసాన్ సమ్మాన్ నిధులు.. నవంబర్ 27 నాటికి అన్నదాతల ఖాతాల్లో పడిపోతాయని అంచనా.
ఈకేవైసీ లేనిదే.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు..
దేశవ్యాప్తంగా అన్నదాతలకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి 2023 సొమ్ము అందాల్సి ఉంటుంది. అందువల్ల.. విడతల వారీగా నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. మరి, మీ బ్యాంకు ఖాతాల్లో నగదు పడిందా? లేదా? అనేది తెలుసుకునేందుకు తరచూ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అర్హులైన వారికి తప్పకుండా నగదు జమ అవుతుంది. ఒకవేళ, ఎవరైనా రైతు ఆ మొత్తాన్ని అందుకోకపోతే.. వారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ pmkisan.gov.in ను తనిఖీ చేయవచ్చు.
అటు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు బంధు పేరుతో అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి రెండు విడతలుగా.. ఎకరానికి 6వేల చొప్పున 12 వేల రూపాయలను అందిస్తోంది. సాగు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు తీయకుండా.. అన్నదాతకు మేలు చేయడానికి ఈ పథకాలు ప్రవేశపెట్టినట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మరి, ఈ దఫా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మీ అకౌంట్లో జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి.