తౌక్టే తుపాను ప్రభావంతో నష్టపోయిన గుజరాత్‌కు తక్షణ సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు తుపాను వల్ల కలిగిన నష్టం, సహాయక చర్యలను పరిశీలించేందుకు గుజరాత్ వెళ్లిన ప్రధాని..... గుజరాత్ సీఎం విజయ్ రుపానీతో కలిసి ఉనా, దీవ్ , జాఫరాబాద్ , మహువా ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేశారు. తర్వాత అహ్మదాబాద్‌లో అధికారులతో సమావేశమైన ప్రధాని తుపాను అనంతర పరిస్థితులపై సమీక్షించారు.
గుజరాత్‌లో తుపాను కలిగించిన నష్టాన్ని అంచనావేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ . దేశంలో తౌక్టే తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు 50 వేల రూపాయలను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రజలకు సంఘీభావం ప్రకటించిన మోదీ.. ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. తుపాను అనంతర చర్యలపై ప్రభావిత రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నామన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట వివరాలను పంపిన తర్వాత తక్షణ ఆర్థికసాయం అందిస్తామన్నారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
విపక్షాల ఆగ్రహం..
గుజరాత్‌లోని తౌక్టే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించడాన్ని ఎన్సీపీ తప్పుపట్టింది. మహారాష్ట్రాలోనూ తుపాను ప్రభావిత ప్రాంతాలున్నాయని తెలిపింది. మహారాష్ట్ర పట్ల ప్రధాని వివక్ష చూపిస్తున్నారని ఆరోపించింది.
ఇదీ చదవండి: బలహీనపడిన తౌక్టే- గుజరాత్‌లో 13 మంది మృతి