Plane Door Open News : అలస్కా ఎయిర్‌లైన్స్ ఘటన నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అప్రమత్తమైంది. బోయింగ్‌కు చెందిన 737-8 మ్యాక్స్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
'అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమాన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బోయింగ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దేశంలో ఏ విమానయాన సంస్థ 737-9 విమానాలను వినియోగించడం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా 737-8 విమానాల్లో అత్యవసరంగా ఒకసారి తనిఖీలు చేపట్టాలి' అని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది.
'బోయింగ్ విమానాల సేవలు నిలిపివేత'
గగనతలంలో భయానక ఘటనతో అలస్కా ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్ 737-9 విమానాల సేవల్ని నిలిపివేసింది. దీంతో సంస్థలోని ఈ మోడల్‌కు చెందిన 65 విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఈ మేరకు అలస్కా ఎయిర్‌లైన్స్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. 'బోయింగ్ విమానంలో జరిగిన ఘటనతో మేం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాం. వాటిలో భాగంగా బోయింగ్ 737-9కు చెందిన 65 విమానాల సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశాం' అని ఎయిర్‌లైన్స్ సీఈఓ వెల్లడించారు.
అమెరికాలోని పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని డోర్ ఊడిపడిపోయింది. దాంతో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా దిగింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరగడం వల్ల ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సుక్షితంగా బయటపడటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ముందు విమానంలో పీడన సంబంధిత సమస్య తలెత్తిందని సిబ్బంది తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) ప్రకటించింది. ఈ విమానాన్ని అక్టోబర్‌లో అలస్కా సంస్థకు డెలివరీ చేశారు. నవంబర్‌లో ధ్రువీకరణ లభించిందని ఎఫ్‌ఏఏ డేటాతో తెలుస్తోంది. ఈ ఘటనపై బోయింగ్ సంస్థ కూడా స్పందించింది. 'దీనిపై మేం మరింత సమాచారాన్ని సేకరిస్తున్నాం. మా కస్టమర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. మా సాంకేతిక బృందం విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉంది' అని పేర్కొంది.