మహారాష్ట్ర పుణె జిల్లాలో చిన్నపాటి విమానం కూలగా.. పైలట్ శిక్షణలో ఉన్న భావనా రాఠోడ్(22) స్వల్ప గాయాలతో బయటపడింది. ఇందాపుర్ మండలం కడ్బన్వాడీలో సోమవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో జరిగింది ఈ ఘటన.
ప్రమాదానికి గురైన విమానం.. ఓ ప్రైవేటు ఏవియేషన్ స్కూల్ది. భావనా రాఠోడ్ ఈ ఫ్లైట్లో ఒంటరిగా పుణెలోని బారామతి విమానాశ్రయంలో బయలుదేరింది. కాసేపటికే పొలంలో కూలిపోయింది. ఫలితంగా విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఒక్కసారిగా భారీ శబ్దం విని.. చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాసేపటికి తేరుకుని సంఘటనా స్థలానికి పరుగెత్తారు. గాయపడ్డ ట్రైనీ పైలట్ భావనను జాగ్రత్తగా పక్కకు తీసుకొచ్చి.. ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విమానంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.