Places to Visit in Hyderabad Details: పర్యాటకంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు... అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన... వినోదం పరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన టాలీవుడ్ పరిశ్రమ... ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో లేనిదంటూ ఏదీ లేదు. సంపద సృష్టికి ఎంతో అనుకూలమైన ఈ నగరాన్ని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచే ఈ నగరంలో చెప్పుకోదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్‌కు కొత్తగా వెళ్లే టూరిస్టులు, కుటుంబంతో సరదగా గడపాలనుకునే వారు.. ఈ ప్రదేశాలకు వెళ్లి మంచి అనుభూతిని పొందండి. ఇంతకీ అవి ఏంటి..? ఎంట్రీ ఫీజు ఎంత..? టైమింగ్స్..?, లోకేషన్..? వంటి పలు వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Places to Visit in Hyderabad
హైదరాబాద్‌లో చూడవలసిన ప్రదేశాలు..
1. హుస్సేన్ సాగర్ సరస్సు..
Hussain Sagar Lake..: హైదరాబాద్‌కు నడిబొడ్డున ఈ సరస్సు ఉంది. హుస్సేన్ సాగర్ సరస్సు ఆసియాలో అతి పెద్ద కృత్రిమ సరస్సుగా పేరొందింది. రాత్రి సమయంలో పడవ ప్రయాణం, ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుంటే.. అది వర్ణించడానికి సరిపోదు. ఇందులో ఉన్న బుద్ద విగ్రహం పర్యాటక ప్రదేశంగా వర్ధిల్లుతోంది.
- లోకేషన్ : నెక్లెస్ రోడ్
- చేయవలసినవి: బోట్ రైడ్, లుంబినీ పార్క్, బుద్ధుని విగ్రహాన్ని సందర్శించడం
- సమయం : ఉదయం 8:00 నుంచి రాత్రి 10:00
- ప్రవేశ రుసుము : ఉచితం
ప్రకృతి అందాల కాణాచి.. అల్మోరా!
2. రామోజీ ఫిల్మ్ సిటీ:
Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్‌లోని అత్యంత ఆకర్షణీయమైన సందర్శనీయ ప్రదేశాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో కాంప్లెక్స్‌గా గుర్తింపు పొందింది. విస్తృతమైన సినిమా సెట్‌లు, సరదా రైడ్‌లు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. 2000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఫిల్మ్‌సిటీలో.. వయస్సుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే బస చేయడానికి అనుగుణంగా లోపల హోటళ్లు కూడా ఉన్నాయి.
- లోకేషన్: అనాజ్‌పూర్, హయత్‌నగర్ మండలం
- సమయాలు : ఉదయం 9 నుంచి సాయంత్రం 6 (ప్రతిరోజు)
- చేయవలసినవి: ఫిల్మ్ సెట్‌ల గైడెడ్ టూర్, థ్రిల్ రైడ్స్, లైవ్ షోలు, బర్డ్ పార్క్
- ప్రవేశ రుసుము: INR 1150
3.నెక్లెస్ రోడ్డు:
Necklace Road: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని హుస్సేన్ సాగర్‌ను ఆనుకొని ఉంది. ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు మధ్యలో ఈ రోడ్డు ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్‌గా మార్చింది. హుస్సేన్ సాగర్‌ను పరిరక్షించడానికి, అందంగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీలో భాగంగా 1996లో హుస్సేన్ సాగర్ సరస్సుకు పశ్చిమం వైపు 3.6 కిలోమీటర్ల పొడవుతో నెక్లెస్ రోడ్డును నిర్మించారు. ట్యాంక్ బండ్ చుట్టూ మణిహారంలా ఉండే ఈ రోడ్డును నెక్లెస్ రోడ్డు అంటారు. ఆకాశం నుంచి చూసినప్పుడు, ఈ రోడ్డు ఒక నెక్లెస్ ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనికి నెక్లెస్ రోడ్డు అని పేరు పెట్టారు. ప్రతిరోజూ ఉదయాన్నే జాగింగ్ చేయడానికి, మారథాన్ వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది బెస్ట్ ప్లేస్.
4. దుర్గం చెరువు:
Durgam Cheruvu: హైదరాబాద్ నగరంలో ఉన్న దుర్గం చెరువు ప్రశాంతమైన, సుందరమైన సరస్సు. ఈ ప్రాంతం స్నేహితులు, కుటుంబసభ్యులతో సమయం గడిపేందుకు ఎంతో ఉత్తమమైన ప్రదేశం. దీనిని చూసేందుకు ప్రతి రోజు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వీకెండ్ అయితే ఈ ప్రాంతంలో ఉండే రద్దీ గురించి అసలు చెప్పక్కర్లేదు. గోల్కొండ కోట వాసులకు ఈ సరస్సు ప్రధాన నీటి వనరు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆసియాలోనే రెండో అతి పెద్ద బ్రిడ్జ్‌గా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రఖ్యాతి గాంచింది.
- లోకేషన్: జూబ్లీహిల్స్
- సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30
5. చౌమహల్లా ప్యాలెస్:
Chowmahalla Palace: 18వ శతాబ్ధం నాటి అద్భుతమైన చారిత్రక కట్టడం 'చౌమహల్లా ప్యాలెస్'. హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేసిన 5వ నిజాం పాలకుడు అసఫ్ జాహీ వంశం నివాస స్థలం ఇది. రాజ్యంలో ఉన్నత స్థాయి సమావేశాలు, రాచరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్ లోనే జరిగేవి. పర్షియన్ భాషలో 'చాహర్' అంటే నాలుగు, అరబ్ భాషలో 'మహాలత్' అంటే సౌధం అని అర్థం వస్తుంది. ఈ రెండు పదాల ద్వారా ఈ భవనానికి అప్పటి పాలకులు చౌమహల్లాగా నామకరణం చేసినట్లు ప్రసిద్ధి. 14 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ లో చూపు తిప్పుకోనివ్వని అద్భుతమైన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. 2010లో యునెస్కో ఈ ప్యాలెస్ కు సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా అవార్డు కూడా అందించింది. హైదరాబాద్ నుంచి 4.8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాలెస్ ఉంది. ఇటీవల మరణించిన ఎనిమిదో నిజాం ముకర్రమ్జా బహదూర్ పార్థివదేహాన్ని ఇక్కడే కాసేపు సందర్శనకు ఉంచారు.
- లోకేషన్: మోతీగల్లి
- సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 (శుక్రవారం క్లోజ్)
- ప్రవేశ రుసుము: భారతీయులకు 50 రూపాయలు, విదేశీ పర్యాటకులకు 200 రూపాయలు
తెలంగాణకి వెళ్తున్నారా.. ఈ పర్యాటక ప్రాంతాలను చూడటం మరవద్దు
6. తారామతి బరాదారి:
Taramati Baradari: అక్కాచెల్లెళ్లయిన తారామతి, ప్రేమామతి.. చివరి కుతుబ్‌షాహీ సుల్తాన్ ఆస్థానంలో నృత్యకారిణులు. మంచి అభినయంతో, అందమైన గాత్రాలతో పాడేవారు. ఇవి రాజులను మంత్రముగ్ధులను చేసేవి. వీరి ఆటపాటలకు వీలుగా తారామతి బరాదారిలో నృత్య వేదికలను నిర్మించారు. మరణానంతరం వీరిద్దరిని ఇబ్రహీంబాగ్‌లోని కుతుబ్‌షాహీల రాజ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఈ రెండు సమాధులు పక్కపక్కనే ఉంటాయి. ప్రస్తుతం వీటినే సుందరీకరించి, పర్యాటకుల సందర్శనకు వీలుగా అంకితం చేశారు. పర్యాటక శాఖ ఈ బరాదారిని ఏడో గోల్కోండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కాలం నాటిదని పేర్కొంది.
- లోకేషన్: ఇబ్రహీంబాగ్
- సమయం: ఉదయం 11 నుంచి సాయంత్రం 6
7. ఓహ్రీ గుఫా:
Ohri’s Gufaa: మీ కుటుంబంతో ప్రత్యేకమైన భోజన అనుభూతిని పొందాలనుకుంటున్నారా? అయితే ఓహ్రీస్ గుఫాలో భోజనం చేయండి. పేరుకు తగ్గుట్లుగా రెస్టారెంట్ లోపలి భాగం గుఫా రూపంలో ఉంటుంది. ఇది గుహకు హిందీ పదం. మెయిన్‌గా రెస్టారెంట్లో వెయిటర్లు వేటగాళ్ల దుస్తులు ధరించి ఫుడ్ సర్వ్ చేస్తారు. జఫ్రానీ ఫిర్ని, ఖుబానీ కా మీఠాలను ఇక్కడ తప్పకుండా ప్రయత్నించండి. పిల్లలు కూడా ఈ స్థలాన్ని ఇష్టపడతారు.
- లోకేషన్: బషీర్ బాగ్
- సమయం: మధ్యాహ్నం 12 నుంచి 3గంటల 30 నిమిషాలు, రాత్రి 7 నుంచి 11
8. ఆలివ్ బిస్ట్రో, హైదరాబాద్:
Olive Bistro, Hyderabad: ఆలివ్ బిస్ట్రో అనేది దుర్గం చెరువుకు అభిముఖంగా తెల్లటి బంగ్లాలో ఏర్పాటు చేసిన ఒక ఫ్యాన్సీ ఇటాలియన్ రెస్టారెంట్. కొబ్లెస్టోన్ మార్గాలు, ఫ్రాంగిపాని చెట్లు ఇక్కడ ఉంటాయి. ఈ రెస్టారెంట్లో పుచ్చకాయ ఫెటా సలాడ్, సీఫుడ్ పిజ్జా, సాంగ్రియాలను తప్పకుండా రుచి చూడాలి.
- లోకేషన్: జూబ్లీహిల్స్
- సమయాలు: రాత్రి 7 నుంచి 11 (సోమవారం-గురువారం), రాత్రి 7 నుంచి 11 (శుక్రవారం-ఆదివారం)
9. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, హైదరాబాద్
Taj Falaknuma Palace, Hyderabad: తాజ్ ఫలక్నామా ప్యాలెస్.. ఒకప్పుడు ఇది నిజాం రాజ నివాసం. ఇప్పుడు చాలా మంది ధనికులు ఇందులో తమ పిల్లల వివాహాలు, పలు ఫంక్షన్లు జరిపించుకుంటున్నారు.
- లోకేషన్: ఫలక్నామా
- సమయాలు: సాయంత్రం 4 నుంచి 5:30 (శనివారం-ఆదివారం)