Piyush jain kanpur raid: జీఎస్టీ ఎగవేత కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. కన్నౌజ్‌లోని ఆడ్కెమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో నుంచి.. ఇప్పటివరకు తాము రూ.17 కోట్ల నగదు, 23 కిలోల బంగారం, 600 కిలోల చందనం నూనెను స్వాధీనం చేసుకున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు సోమవారం తెలిపారు. పర్ఫ్యూమ్లు తయారు చేసేందుకు వినియోగించే ఇతర ముడిపదార్థాలనూ సీజ్ చేశామని చెప్పారు.
మొత్తం రూ.194.45 కోట్లు..
స్వాధీనం చేసుకున్న చందనం నూనె విలువ విలువ రూ.6 కోట్లుగా ఉంటుందని డీజీజీఐ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి కూడా కన్నౌజ్‌లో తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. దీంతో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు విలువ రూ.194.45 కోట్లు అని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బంగారంపై విదేశీ గుర్తులు ఉన్నందున డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్... రంగంలోకి దిగి, దర్యాప్తు చేపట్టనుందని పేర్కొన్నారు.
Kanpur IT raid
సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం పీయూష్‌ను అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. తనిఖీల్లో భాగంగా తొలిరోజు తనిఖీ చేస్తున్న సమయంలో.. పీయూష్ తన ఇంటి నుంచి పారిపోయాడని అధికారులు తెలిపారు. అనంతరం పలుమార్లు ఫోన్లు చేయగా.. రెండు గంటల తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు.
ఎస్పీ నేత!
Piyush Jain Samajwadi party: పీయూష్ సమాజ్‌వాదీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. ఇటీవల సమాజ్‌వాదీ సెంట్ పేరుతో రూపొందించిన సుగంధ ద్రవ్యాన్ని ఈయన కంపెనీలోనే తయారు చేశారు.
జ్యుడీషియల్ కస్టడీ
జీఎస్టీ ఎగవేత కేసులో పటిష్ఠ భద్రత మధ్య జైన్‌ను కాన్పుర్ కోర్టుకు అధికారులు సోమవారం తరలించారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అంతకుముందు ఆయనకు అధికారులు కొవిడ్ పరీక్షలు సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి: ఎస్పీ నేత పీయూష్ జైన్ అరెస్టు- మరో రూ.10 కోట్లు సీజ్
ఇదీ చదవండి: ఎస్పీ నేత ఇంట్లో నల్లధనం.. విలువ రూ.177 కోట్లు!