షాపింగ్ మాల్లో చాకెట్లు దొంగలిస్తున్న వీడియో వైరల్ కావడం వల్ల మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తమ బిడ్డ మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులతో పాటు కాలనీ వాసులు మాల్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన బంగాల్లోని అలీపుర్‌ద్వార్‌లో జరిగింది.
జైగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌పల్లి ప్రాంతానికి చెందిన పూజా ఘోష్ అనే 20 ఏళ్ల యువతి షాపింగ్ మాల్‌కు వెళ్లింది. షాపింగ్ ముగిశాక అకౌంట్లో ఏదో సమస్య ఉన్నందున యువతి తల్లి అక్కడకు చేరుకుని ఆ సమస్యను పరిష్కరించింది. కానీ ఆమె అక్కడ చాక్లెట్లు దొంగతనం చేసిన సమయంలో రికార్డయిన ఫుటేజ్ ఆ షాపు యాజమాన్యం ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇది చూసిన ఇరుగుపొరుగు వారు ఆ యువతికి విషయం చెప్పారు. తీవ్ర మనస్తాపానికి గురైన పూజ.. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న వెంటనే ఇంటికి చేరగా అప్పటికే పూజ మృతి చెందినట్లు గుర్తించారు.
ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు మాల్ ఎదుట బైఠాయించారు. ఆ ఫుటేజ్ లీక్ చేసిన షాపు యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫుటేజ్‌ను ఎవరు లీక్ చేశారన్న కోణంలో విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు దుర్మరణం