Petrol bomb attack on BJP office: నీట్ పరీక్షపై భాజపా తీరును నిరసిస్తూ చెన్నైలోని భాజపా కార్యాలయంపై బుధవారం అర్ధరాత్రి పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఒకటిన్నర సమయంలో వినోత్ అనే యువకుడు పెట్రోల్ బాంబు విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.


నీట్ పరీక్షకు సంబంధించి భాజపా తీరుకు వ్యతిరేకంగానే నిందితుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ దాడి వెనుక ఎటువంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని.. గతంలో ఇటువంటి ఘటనలకు వినోత్ పాల్పడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


మరోవైపు బాంబు దాడులకు భయపడబోమన్న భాజపా నేతలు.. 15 ఏళ్ల క్రితం డీఎంకే ప్రభుత్వ హయాంలోనూ ఇదే తరహా ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థతో(ఎన్ఐఏ) దర్యాప్తు జరిపించాలని తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: కరోనా వేళ 'ఓట్ల' పండగ- ఉత్సాహంగా తరలిన ఓటర్లు