"మీ నియోజకవర్గంలో కనీసం ఒక్క ఆక్సిజన్ యూనిట్ నెలకొల్పారా? కరోనా రోగుల కోసం పడకల్ని సమకూర్చారా? ఒక పలుకుబడిగల ఎమ్మెల్యే పదవిలో ఉండి ఏం చేశారు? ఇవన్నీ చేయకుండా ప్రభుత్వాన్ని ఆక్సిజన్ సిలిండర్లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి తెమ్మని ఎలా పిటిషన్ వేశారు" అని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్‌పై మండిపడింది ఆ రాష్ట్ర హైకోర్టు.
ఆక్సిజన్ కొరత ఉందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పాటిల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యమే కాదని, ప్రచారం కోసం దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే భారీ జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
హైకోర్టు ఆగ్రహంతో పాటిల్ తరపు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఇదీ చదవండి: టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా- మమత కోసమేనా?