Group1 Prelims update : ఈనెల 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో బయోమెట్రిక్ వివరాలు సేకరించలేదని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేకుండా ఓఎంఆర్ షీటు ఇచ్చారని పిటిషనర్లు తెలిపారు. గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబరు 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు కావడంతో.. జూన్ 11న మళ్లీ నిర్వహించారు.
రాష్ట్రంలో 503 పోస్టులకు నిర్వహిస్తున్న గ్రూప్-1కు.. 3, 80, 202 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పెట్టారు. ఉదయం 10.30 గంటల మొదలైన గ్రూప్-1 ప్రిలిమ్స్.. మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 8.30 నుంచి 10.15 వరకు మాత్రమే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. 10.15 గంటల తర్వాత వచ్చిన వారిని ఆలస్యమైందంటూ.. పరీక్ష రాయటానికి అధికారులు అనుమతించలేదు.
tspsc paper leakage SIT investigation report : ఏఈఈ ప్రశ్నాపత్రం లీకైనట్లు మార్చి 11వ తేదీన టీఎస్పీఎస్సీ సహాయ కార్యదర్శి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మార్చి 13న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, ఢాక్యా నాయక్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి సమాచారం ఆధారంగా విడతల వారీగా అరెస్టులు జరిగాయి.
ఈ లీకేజీ ఘటనను దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. విచారణ అనంతరం టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కేసులో సిట్ అధికారులు అభియోగపత్రం కోర్టు ముందుంచారు. 37 మందిని నిందితులుగా చేరుస్తూ నాంపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు గుర్తించినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 49 మందిని అరెస్ట్ చేశామని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్‌లో పరారీలో ఉన్నట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రాలు లీకైనట్లు సిట్ అధికారులు అభియోగపత్రంలో పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీ ఏఎస్ఓ ప్రవీణ్, పొరుగు సేవల విభాగంలో పని చేస్తున్న కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ అక్రమంగా కంప్యూటర్లోకి లాగిన్ అయి ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నట్లు అభియోగపత్రంలో పొందుపర్చారు. డబ్బుల కోసం ప్రశ్నపత్రాలను ఒకరి నుంచి మరొకరికి విక్రయించినట్లు తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్, ఏఈ ప్రశ్నాపత్రం లీక్ చేసిన రేణుక, ఢాక్యా నాయక్‌తో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు.
ఇవీ చదవండి: