హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా.. విభిన్న సంప్రదాయాలకు, ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. కానీ ఈ ప్రాంతంలోని ఓ ఊరు...కొన్ని సంవత్సరాలుగా కఠినమైన నియమాలు అమలు చేస్తూ, దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ఆ గ్రామమే రారంగ్. ఊరంతా ధూమపాన వ్యతిరేక పోస్టర్లు కనిపిస్తాయి. గతంలో ఎన్నోసార్లు కార్చిచ్చు కారణంగా అట్టుడికిన ఈ పల్లె....ఓ నియమావళి రూపొందించుకుని, స్వయంగా పరిష్కారం కనుగొంది.
"ఊర్లోని ఇళ్లన్నీ పక్కపక్కనే, ఒకదానికొకటి ఆనుకున్నట్లే ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే మంటలు అంటుకునే ప్రమాదముంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం."
-రంజిత్ నేగి, రారంగ్ పంచాయతీ ఉపాధ్యక్షుడు
"వందేళ్ల క్రితం ఇక్కడ ఓ అగ్నిప్రమాదం జరిగిందని మా పెద్దవాళ్లు చెప్పేవారు. మా ముందే 7 సార్లు మంటలు చెలరేగాయి. కొన్నిసార్లు పిల్లలు, పెద్దలు అంతా కలిసి రాత్రి 2 గంటల సమయంలోనూ మంటలు ఆర్పేందుకు వెళ్లేవాళ్లం."
-దగ్‌దగ్ లామో, స్థానికుడు
గడిచిన వందేళ్లలో రారంగ్‌లో 7 అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఊరు ఊరంతా కాలి బూడిదైంది. మరో మూడు ఘటనల్లో సగం ఊరు అగ్నికి ఆహుతైంది. చివరగా 2005లో ప్రమాదం జరిగి, 3 ఇళ్లు కాలిపోయాయి. రారంగ్ కొండప్రాంతంలో ఉండే ఓ ఊరు. రోజంతా బలమైన గాలులు వీస్తూనే ఉంటాయి. చిన్న నిప్పురవ్వ నుంచైనా, పెద్ద కార్చిచ్చు చెలరేగుతుంది. పైగా ఈ ప్రాంతంలో సంప్రదాయ కలప ఇళ్లే అధికంగా ఉంటాయి. రెండిళ్ల మధ్య దూరం కూడా చాలా తక్కువ. ఓ ఇంటి నుంచి మరో ఇంటికి మంటలు అంటుకునే అవకాశాలు ఎక్కువ. ఈ ఊరికి అగ్నిమాపక కార్యాలయం కూడా ఈ ఊరి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అధికారులకు సమాచారమిచ్చినా...వాళ్లు చేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయేది.
"ఇక్కడ చాలాసార్లు మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదాలను నిలువరించడంలో మా ఐకమత్యమే ప్రధాన పాత్ర పోషించింది."
-రవి నేగి, స్థానికుడు
బీడీలు, సిగరెట్లు కాల్చడంతోపాటు, అనవసరంగా సమూహాలుగా ఏర్పడడంపైనా రారంగ్ నిషేధం విధించింది.
"ఈల వినిపిస్తే ఊర్లో ఎక్కడో మంటలున్నాయని అర్థం. ఓ పాత నమ్మకం ఇంకా మాలో ఉంది. రెండేళ్ల క్రితం మా గ్రామంలో కార్చిచ్చు చెలరేగితే ఈలల ద్వారానే ప్రజలంతా ఏకమయ్యారట. అప్పటినుంచీ అగ్ని ప్రమాదం జరిగినా, ఇంకే ప్రమాదాలు జరిగినా ఊర్లో అక్కడక్కడా ఈలలు వేస్తారు. కారణం లేకుండా ఈలలు వేస్తే మాత్రం ఊరుకోరు."
-యోవన్ సింగ్, స్థానికుడు
పనిలేకపోయినా గుంపులుగా చేరి, మాట్లాడుకుంటే 500 రూపాయల జరిమానా విధిస్తారు. సమయం వృథా చేస్తున్నందుకు గానూ...సదరు వ్యక్తులకు శిక్ష విధించే హక్కూ పంచాయతీకి ఉంది. ఊర్లో చెలరేగే ప్రతి కార్చిచ్చునూ గ్రామస్థులే స్వయంగా ఆర్పేస్తారు. ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తున్న రారంగ్...అగ్నిప్రమాదాల వల్ల ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకుంది.
"ఊరికి చాలామంది పర్యాటకులొస్తారు. బీడీలు, సిగరెట్లు నిషేధించామని వారికి తెలియదు. ఇక్కడ మద్యపానం చేస్తే, గ్రామస్థులు వారిని అడ్డుకుంటారు. ఇలా ఊరంతా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది."
-రవి నేగి, స్థానికుడు
గ్రామంలో జరిగే వివాహ వేడుకలకూ ఈ నియమాలు వర్తిస్తాయి. ఊర్లో ధూమపానం కనుమరుగై పోయింది. ఎక్కడైనా నిప్పు పెట్టాల్సి వస్తే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అగ్నిప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు రారంగ్ గ్రామ ప్రజలు పెట్టుకున్న షరతులు...ఇతర గ్రామాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకోకుండా యువతకూ మేలు చేకూరుస్తున్నాయి.
"మాదకద్రవ్యాలకు బానిస కాకుండా యువతలో స్ఫూర్తి నింపాలన్నదే మా ఉద్దేశం. సమీప భవిష్యత్తులోనే వారిని పూర్తిగా డ్రగ్స్‌కు దూరం చేయాలి."
-రంజిత్ నేగి, రారంగ్ పంచాయతీ ఉపాధ్యక్షుడు
ఊర్లను, అడవులను కార్చిచ్చు నుంచి కాపాడేందుకు, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. కానీ రారంగ్ గ్రామం మాత్రం ఈ సమస్యలకు తమ కట్టుదిట్టమైన నియమ నిబంధనలతో ఎప్పుడో పరిష్కారం కనుగొంది. ఆ శ్రమ రాబోయే ఎన్నో తరాలకు తీపిఫలాలను అందించనుంది.
ఇదీ చదవండి: ఐదేళ్లలో 1985 శాతం పెరిగిన ఎమ్మెల్యే ఆస్తులు