కరోనా వైరస్ దేశంలో స్వైర విహారం చేస్తోంది. మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు లాక్డౌన్లు విధించాయి. ఈ క్రమంలోనే కర్ణాటక, బళ్లారి జిల్లాలో కొన్ని ప్రాంతాల ప్రజలు కరోనాను అంతం చేయడానికి మూఢ నమ్మకాలను పాటిస్తున్నారు. జంతు బలులు, హోమాలు చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన ఆహారాన్ని ఊరిపై చల్లుతున్న సంఘటనలు కనిపించాయి.
వందల కేజీల పెరుగు అన్నం..
కరోనా వైరస్ను అంతం చేయడానికి బళ్లారి జిల్లా దమ్మూరు కగ్గళ్ గ్రామంలో వందల కేజీల పెరుగు అన్నాన్ని ఊరంతా చల్లారు. ప్రతి ఇంటి నుంచి 5 కేజీల పెరుగు అన్నాన్ని సేకరించి ఓ ట్రాక్టర్ ట్రక్కు నిండా నింపారు. ఆ తర్వాత గ్రామంలో చల్లారు. ఈ విధంగానే కొలగళ్లు గ్రామంలోనూ చేశారు.
మారమ్మకు జంతు బలి..
వైరస్ను అంతం చేయాలని చామరాజనగర్ జిల్లాలో మారమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లు, మేకలను బలి ఇచ్చారు.
హోమాలతో ఎమ్మెల్యే..
బెల్గాం దక్షిణ యోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభయ్ పాటిల్ హోమాలు నిర్వహించారు. హోమాల్లో నెయ్యి, కర్పూరం, నిమ్మకాయలు, బియ్యం, లవంగాలను ఉపయోగించారు. దాదాపు 50 చోట్ల హోమాలను జరిపారు. వాతావరణం పరిశుభ్రమౌతుందని పాటిల్ అంటున్నాడు. ఓ బండిలో హోమం కాల్చుతూ.. ఊరంతా తిప్పారు.
ఇదీ చదవండి: తెల్లవారితే పెళ్లి- ప్రేయసితో వరుడు పరార్