పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సవివరమైన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలా? వద్దా? అనేదానిపై మంగళవారం నిర్ణయాన్ని వెలువరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. సోమవారం ఈ అంశంపై వాదోపవాదాలు విన్న అనంతరం ఈ విషయాన్ని తెలిపింది. దీనిపై దాఖలైన పలు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దాదాపు గంటసేపు ఆసక్తికరమైన వాదనలు చోటుచేసుకున్నాయి.
రెండు పేజీల ప్రమాణ పత్రం
తొలుత కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రెండు పేజీల 'పరిమిత ప్రమాణ పత్రాన్ని' సమర్పించింది. "పెగసస్ స్పైవేర్ ఉపయోగించినట్టు పిటిషన్‌దారులు చేసిన ఆరోపణలు ఏమాత్రం నిజం కావు. వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా, ఆధారాలు లేకుండా ఊహాగానాలతో మీడియాలో వచ్చిన వార్తలు ఆధారంగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాస్తవాలను నిర్ధరించడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తుంది. తగినంత సమయం లేనందున పిటిషన్లలో పేర్కొన్న అంశాలపై సమాధానం ఇవ్వడం లేదు. పరిమితమైన ప్రమాణ పత్రాన్నే సమర్పిస్తున్నాం. అవసరమైతే సవవిరమైనది ఇస్తాం. ఇప్పటికే ఈ విషయమై మంత్రులు పార్లమెంటులో వివరణ ఇచ్చారు" అని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ పెగసస్ స్పైవేర్‌పై దాచుకోవాల్సిందేమీ లేదని చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమని, దీన్ని సంచలనం చేయకూడదని అన్నారు.
కమిటీ అన్నింటినీ పరిశీలించలేదేమో
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కొన్ని సమస్యలను నిపుణుల కమిటీ పరిశీలించలేదేమోనని వ్యాఖ్యానించింది. దీనిపై సొలిసిటర్ జనరల్ జవాబిస్తూ అలాంటి సమయాల్లో కోర్టే మార్గదర్శకాలు జారీ చేయవచ్చని చెప్పారు. మరో పిటిషన్‌దారు తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ మాట్లాడుతూ ప్రభుత్వం నియమించే కమిటీ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించదని అన్నారు. న్యాయస్థానమే కమిటీని ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలని కోరారు. మళ్లీ ధర్మాసనం స్పందిస్తూ "ప్రభుత్వం విముఖత చూపుతున్నప్పుడు సవివరమైన ప్రమాణ పత్రం సమర్పించాలని ఎలా ఒత్తిడి తీసుకురాగలం? ఒక వేళ సవివర ప్రమాణ పత్రం సమర్పించాలని సొలిసిటర్ జనరల్ భావిస్తే మేం చెప్పడానికి ఏమీ లేదు. లేకుంటే అందరి వాదనలు వింటాం" అని వ్యాఖ్యానించింది.
నిందితుడే దర్యాప్తు చేసుకుంటాడా?: కాంగ్రెస్
నిపుణుల కమిటీ వేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను కాంగ్రెస్ తప్పుపట్టింది. నిందితుడే ఎక్కడైనా దర్యాప్తు చేసుకుంటాడా అని ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.
ఇదీ చదవండి:'పెగసస్' పెనుభూతం.. మీ ఫోనూ హ్యాక్ కావచ్చు!
పెగసస్‌పై కేంద్రం అఫిడవిట్- ట్రైబ్యునళ్ల జాప్యంపై సుప్రీం అసహనం