కరోనా రెండోదశతో దేశం అతలాకుతలం అవుతుండగా.. కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించినా.. అప్పుడే ముప్పు తప్పిపోలేదని, భవిష్యత్తులో వైరస్ విజృంభించి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. వైరస్ను ఎదుర్కొవడానికి జాతీయ స్థాయిలో సన్నద్ధంకావాలని సూచించింది. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్.
"కొవిడ్ భవిష్యత్తులో విజృంభించే అవకాశాలు ఉన్నాయి. ఒకానొక దశలో గరిష్ఠ స్థాయికి చేరుతుంది. అందుకే రాష్ట్రాల సహకారంతో జాతీయ స్థాయిలో సన్నాహాలు జరగాలి. మౌలిక సదుపాయాలు పెరగాలి. నియంత్రణ చర్యలు అమలు చేయాలి. కరోనాకు తగిన ప్రవర్తనను అనుసరించాలి. అయితే ఎవరినీ భయాందోళనకు గురిచేడానికి కాదు.. ఇతర దేశాలు ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగానే ఈ అంచనా వేశాం. ఇది ఒక మహమ్మారి."
- వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యులు
కరోనా రెండో దశపై ప్రభుత్వానికి అవగాహన లేదని వస్తున్న ఆరోపణలు తోసిపుచ్చారు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్. కొవిడ్ రెండోదశ గురించి హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. జనాభాలో 80 శాతం మంది ప్రమాదంలోనే ఉన్నారని పేర్కొన్న ఆయన.. వైరస్ ఎక్కడికీ వెళ్లలేదని.. ఇతర దేశాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయన్నారు. అందుకే వైరస్ మళ్లీ వ్యాపించవచ్చన్నారు. అయితే ఏ స్థాయిలో ఉంటుదన్నది చెప్పలేమన్నారు. గ్రామల్లోనూ కరోనా వ్యాప్తి తీవ్రమవుతుందన్నారు. ప్రజలకు టీకాలు వేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: కరోనాను జయించిన 104 ఏళ్ల వృద్ధుడు