Pawan Kalyan Varahi yatra: తనకు అవకాశం వస్తే ఈ గూండాలను వీధుల్లో తన్నుకుంటూ తీసుకెళ్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాకినాడ జిల్లా సర్పవరం కూడలిలో పవన్ వారాహి విజయ యాత్ర సభ నిర్వహించారు. వారాహి వాహనంపై ర్యాలీగా ముత్తా క్లబ్ నుంచి సభ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను చూడటానికి జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. 2009లోనే తాను పూర్తిగా రాజకీయాల్లోకి వస్తే జగన్‌ను అధికారంలోకి రానిచ్చేవాడిని కాదని పేర్కొన్నాడు. సీఎం జగన్.. దోపిడీదారుడు, నేరస్తుడని ఆరోపించాడు. కాకినాడ జనవాణిలో సమస్యలు వింటుంటే బాధ కలిగిందిని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు.
సీఎం అండతోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ జిల్లాను లూటీ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. అందులో భాగంగానే ద్వారంపూడి.. నేర సామ్రాజ్యం నడుపుతున్నారని విమర్శించాడు. ద్వారంపూడి ఇంట్లోని అందరూ గూండాలని తెలిసిందని వెల్లడించారు. ఎమ్మెల్యే ద్వారంపూడిని ఈసారి గెలవకుండా చేస్తానని పవన్ సవాలు విసిరారు. ద్వారంపూడి దగ్గరున్న గూండాలకు కాకినాడలో నిలబడి హెచ్చరిస్తున్నానన్న పవన్.. ద్వారంపూడి అక్రమాల జాబితా అంటూ... పవన్ కల్యాణ్ ఓ జాబితాను చదివి వినిపించారు. నేటి నుంచి ద్వారంపూడీ పతనం ప్రారంభమైందంటూ హెచ్చరించారు. ద్వారంపూడి నేరసామ్రాజ్యాన్ని కూల్చకుంటే నా పేరు పవన్ కాదంటూ సవాలు విసిరారు.
కులాన్ని వాడుకుని నాయకులే ఎదుగుతున్నారన్న పవన్ కల్యాణ్.. ఎస్సీ డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేస్తే ఎస్సీ నేతలేం మాట్లాడరా? అని నిలదీశాడు. ఎస్సీ, బీసీ యువతను చంపేస్తుంటే వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. ఏపీలో కులం అనే భావనే అందరిలో ఉంది.. కులం నుంచి బయటపడకపోతే ఏపీ సర్వనాశనం అవుతుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజల్లో కులాలు కాదు.. మనది ఆంధ్రా అనే భావన రావాలని పవన్ పిలుపునిచ్చారు. కులదూషణతో రెచ్చగొడితే మర్యాదగా ఉండదని పవన్ కల్యాణ్ వైసీపీ నేతల్ని హెచ్చరించారు.
శాంతిభద్రతలపై అమిత్ షా వ్యాఖ్యల లోతు అర్థం చేసుకోవాలని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయ క్రైం బ్యూరో నివేదిక చదివి వినిపించారు. 2019 నుంచి ఇప్పటివరకు 31,177 ఆడపిల్లల కిడ్నాప్ జరిగిందని వెల్లడించారు. వైసీపీ క్రిమినల్స్ ఆడపిల్లల్ని ఎక్కడికి తరలిస్తున్నారో తెలీటంలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. గంజాయి మత్తులో యువత నేరాలు చేస్తోందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారంటే శాంతిభద్రతల పరిస్థితి తెలుస్తోందని విమర్శించారు. ప్రజల కోసమే ఫ్యాక్షనిస్టు జగన్‌తో గొడవ పెట్టుకుంటున్నట్లు పవన్ పేర్కొన్నారు.