Janasena Chief Pawan Complaint on CI Anju Yadav: ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియచేసే ప్రాథమిక హక్కుకు విఘాతం కలిగించేలా శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ వ్యవహరించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేత కొట్టే సాయిపై.. సీఐ దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రాథమిక హక్కులు కాలరాసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూయాదవ్.. జనసేన నేత సాయిపై దాడి చేసిన సంఘటన వ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నామన్నారు.
"సహజంగా నిరసన చేయడం అనే పౌరుల ప్రాథమిక హక్కు. ఎలాంటి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా నిరసన చేయడం మన హక్కు. కొట్టే సాయి చాలా శాంతియుతంగా నిరసన చేస్తుండగా సదరు మహిళా సీఐ అతనిపై చేయి చేసుకున్నారు. ప్రాథమిక హక్కులు కాలరాసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరా. అలాగే సుమోటోగా కేసు స్వీకరించి మానవ హక్కుల కమిషన్‌కు కూడా ధన్యవాదాలు"-పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఆ బాధ్యత పౌరులపై ఉంది: క్రమశిక్షణ కలిగిన జనసేన నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ ప్రభుత్వానికి, పోలీసులకు సహకరిస్తారని తెలిపారు. అలాగే పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పవన్ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ పార్టీ నేత సాయిపై శ్రీకాళహస్తి సీఐ చేయిచేసుకోవడం సరికాదన్నారు. పోలీసులకు.. జనసేన అన్ని వేళలా సహకరిస్తోందని, అదే సమయంలో.. వారూ నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలన్నారు. 2011లో దిల్లీ రామ్‌లీలా మైదానం ఘటనపై సుప్రీంకోర్టు తీర్పును ఎస్పీకి వివరించానని పవన్ తెలిపారు.
నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం: పవన్ ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ పరమేశ్వరరెడ్డి.. శ్రీకాళహస్తిలో జగన్ దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకునే క్రమంలో ఈ సంఘటన జరిగిందన్నారు. సీఐ అంజూయాదవ్‌కు ఎలాంటి ఛార్జిమెమో ఇవ్వలేదని,. విచారణ కోసం కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీస్ వచ్చిందని తెలిపారు.
దిల్లీ వెళ్లిన జనసేనాని: అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన అభిమానుల కోలాహలం మధ్య సాగింది. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకొన్న పవన్.. రేణిగుంట కూడలి, గాజులమండ్యం, తిరుచానూరు ఫ్లై ఓవర్, తుమ్మలగుంట కూడలి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, పశ్చిమ చర్చి, బాలాజీ కాలనీ, ఎన్టీఆర్ కూడలి మీదగా నిర్వహించిన ర్యాలీతో తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకొన్నారు. ఎస్పీ కార్యాలయానికి పవన్‌కల్యాణ్ వస్తున్న సమచారాన్ని తెలుసుకొన్న అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఒక అభిమాని క్రేన్‌కు వేళాడుతూ.. పవన్‌ను సన్మానించాడు. తిరుపతి పర్యటన ముగించుకొన్న పవన్ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి.. ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. మంగళవారం.. NDA భాగస్వామ పక్షాల భేటీలో పాల్గొననున్నారు.