Patient Theft Dead Body Gold Ornaments : బిహార్‌లోని నలంద ప్రభుత్వాస్పత్రిలో ఐదేళ్లుగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి.. మృతదేహం మెడలో బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా పకడ్బందీగా దోచేద్దామనుకున్నా.. అడ్డంగా దొరికిపోయాడు.
అసలేం జరిగిందంటే?
బిహార్.. షరీఫ్‌లోని ఖండ్ మొహల్లాకు చెందిన నిందితుడు ప్రేమ్‌చంద్ ప్రసాద్.. ఐదేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడి కుమారుడు, కోడలు ఇంటి నుంచి గెంటివేశారు. ఆస్పత్రి సిబ్బంది.. మానవత్వంతో అతడిని చేరదీసింది. చికిత్స ఇప్పించి వ్యాధిని నయం చేసింది. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉండేందుకు అనుమతించింది.
బంగారు గొలుసు చోరీ..
Theft Of Jewellery From Dead Bodies : అయితే సెప్టెంబరు 25వ తేదీన నలందలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారిని నలంద ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ వారు కూడా మరణించారు. అదే సమయంలో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ప్రేమ్‌చంద్ ప్రసాద్.. ఓ యువకుడి మృతదేహం మెడలోని బంగారు గొలుసు చోరీ చేశాడు. వెంటనే గమనించిన మృతుడి కుటుంబసభ్యులు.. నిందితుడిని పట్టుకుని వైద్యులకు అప్పగించారు.
'వెళ్లిపోమని చెప్పినా వెళ్లడు'
ప్రేమ్‌చంద్ సుమారు ఐదేళ్లుగా ఆస్పత్రిలోనే ఉంటున్నాడని డిప్యూటీ సూపరింటెండెంట్ డా.అశోక్ కుమార్ తెలిపారు. "కొన్నేళ్లుగా అతడు ఆస్పత్రిలో ఉంటున్నాడు.. వెళ్లిపోమని చెప్పినా వెళ్లడు. రెండు మూడు గంటల పాటు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లినా తనకు ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉందంటూ మళ్లీ వచ్చేసేవాడు. తనకు ఉండేందుకు ఇల్లు, తినడానికి ఆహారం లేదని చెప్పేవాడు. అలా మానవత్వంతో అతడికి ఉండేందుకు అనుమతించాం. అతడు చోరీ చేయడం ఇదే తొలిసారి" అని చెప్పారు.
ఆస్పత్రిలో ఎందుకు ఉంటున్నావని అడగ్గా..
ఇన్నేళ్లుగా ఆస్పత్రిలో ఎందుకు ఉంటున్నావని ప్రేమ్‌చంద్‌ను అడగ్గా.. తన ఇంట్లో ఉండేందుకు స్థలం లేదని అందుకే ఇక్కడ ఉంటున్నట్లు చెప్పాడు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. కుమారుడు, కోడలు ఇంటికి రానివ్వరని తెలిపాడు. ప్రతి వారం తన కుమారుడు, కోడలు కలవడానికి వస్తారని చెప్పాడు. అయితే మృతుడికి సంబంధించిన బంగారు చైన్, లాకెట్‌ను వైద్యులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వెంటనే బయటకు పంపేశారు. ప్రేమ్‌చంద్‌ను ఇకపై సదర్ ఆసుపత్రికి రానివ్వకూడదని విధుల్లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, సెక్యూరిటీ గార్డులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
దొంగల నయా స్కెచ్.. తాళం పగలలేదు.. తలుపు విరగలేదు.. కానీ ఇంట్లోని 800 గ్రాముల బంగారం చోరీ