47కి చేరిన మృతులు..
మధ్యప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 47కి చేరింది. సహాయక చర్యలు ముగిశాయని తెలిపారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో సీధీ జిల్లాలోని పట్నా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తొలుత 18మంది మృతిచెందినట్టు వార్తలు వచ్చినప్పటికీ సహాయక చర్యల్లో మరిన్ని మృతదేహాలను గుర్తించారు. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడంతో ఇంకొందరు గల్లంతయ్యారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. దీనిపై రేవా డివిజినల్ కమిషనర్ రాజేశ్ జైన్ మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని చెప్పారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు చెప్పారు.