Air India Urination Incident : ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ముంబయి నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా AIC 866 విమానంలో ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేశాడు. అనంతరం అక్కడే ఉమ్మివేశాడు. ప్రయాణికుడి దుష్ప్రవర్తనను గమనించిన క్యాబిన్ సిబ్బంది.. అతడిని హెచ్చరించారు. తోటి ప్రయాణికులు అతడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విమాన సిబ్బంది.. దిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు.
దిల్లీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది.. నిందితుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో నిందితుడు ఆఫ్రికాలో కుక్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఈ ఘటన జూన్ 24న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'ఎయిర్ ఇండియా సిబ్బంది ఫిర్యాదు చేయడం వల్ల నిందితుడిని అరెస్టు చేశాం. అనంతరం కోర్టులో హాజరు పరిచాం. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ జరుగుతోంది' పోలీసులు తెలిపారు.
తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన..
విమానంలో ఇలా అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఏప్రిల్‌లో అమెరికన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ఇలాంటి ఘటన జరిగింది. అమెరికా నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు.. మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. విమానం దిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు సమాచారం అందించారు. అనంతరం నిందితుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ కథనం పూర్తిగా చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
విమానంలో మహిళపై మూత్ర విసర్జన..
గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానం ఓ వ్యక్తి.. బిజినెస్ క్లాస్ సీటులో కూర్చున్న ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు శంకర్ మిశ్ర అనే ఓ వ్యక్తి. ఈ ఘటనను తీవ్రంగా ఆక్షేపిస్తూ బాధితురాలు టాటా గ్రూప్ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దూమారం రేపింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎయిర్ఇండియాను ఆదేశించింది. ఈ ఘటనలో ఎయిర్ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. దీంతో పాటు ఆ విమాన పైలట్ లైసెన్సును 3 నెలలపాటు సస్పెండ్ చేసింది. తన విధులు సరిగ్గా నిర్వర్తించనందుకు గాను ఎయిర్ ఇండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్‌కు రూ.3లక్షల ఫైన్ వేసింది డీజీసీఏ.