Parliament winter session: లఖింపుర్ ఖేరి ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇచ్చిన నివేదికపై పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు భగ్గుమన్నాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే.. నినాదాలతో విరుచుకుపడ్డాయి. దీంతో రెండు సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.
Ajay mishra resignation demand
కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర రాజీనామా చేయాలని రాజ్యసభలో విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఆయన కుమారుడు ఆశిశ్ మిశ్ర ఈ ఘటనలో నిందితునిగా ఉన్న నేపథ్యంలో మంత్రిగా కొనసాగే అర్హత అజయ్ మిశ్రకు లేదని అన్నారు. నినాదాలతో కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుండటం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.
Rahul Gandhi in Lok Sabha
అటు లోక్‌సభలోనూ విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్ష నేతలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్ ఓంబిర్లా. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వగా.. అజయ్ మిశ్రను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఓ నేరస్థుడు అని, లఖింపుర్ ఘటనతో ఆయనకు సంబంధం ఉందని రాహుల్ ఆరోపించారు.
అయితే, ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి అడిగిన ప్రశ్నకే పరిమితం కావాలని రాహుల్‌కు స్పీకర్ సూచించారు. కానీ, రాహుల్ తన డిమాండ్‌ను కొనసాగించడం.. సభలో ఉద్రిక్తతకు దారి తీసింది. విపక్షాల నినాదాలను భాజపా ఎంపీలు ఖండించారు. సభలో ఆందోళన తీవ్రం కావడం వల్ల కార్యకలాపాలను వాయిదా వేశారు స్పీకర్.
Prahlad joshi Opposition protests
విపక్షాల నిరసనలను ఖండించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి.. లఖింపుర్ ఘటనలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని గుర్తు చేశారు. 'పార్లమెంట్ అనేది చర్చించే వేదిక. విపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలను మేం ఆశిస్తున్నాం. చర్చల కోసం ఆహ్వానిస్తే వారు నిరాకరిస్తున్నారు. 2024 ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఇప్పుడైతే పార్లమెంట్లో చర్చ జరగనివ్వండి' అని అన్నారు.
వరుణ్ సింగ్‌కు నివాళి
అంతకుముందు.. బుధవారం ప్రాణాలు కోల్పోయిన వాయుసేన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు లోక్‌సభ నివాళి అర్పించింది. ఆయన మరణానికి సంఘీభావంగా.. లోక్‌సభ సభ్యులు కొద్ది క్షణాల పాటు మౌనం పాటించారు. తమిళనాడు హెలికాప్టర్ క్రాష్‌లో గాయపడిన వరుణ్ సింగ్.. చికిత్స పొందుతూ బెంగళూరులో తుది శ్వాస విడిచారు.
హోంశాఖ కార్యాలయానికి మిశ్ర
మరోవైపు, అజయ్ మిశ్ర.. కేంద్ర హోంశాఖ కార్యాలయానికి వెళ్లారు. ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన.. పలు అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్ నేపథ్యంలో.. ఆయన ఇక్కడికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: అమ్మాయిల కనీస వివాహ వయసు.. 21ఏళ్లకు పెంపు!