మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన వర్షాకాల సమావేశాల తొలిరోజు పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. సభా కార్యకలాపాలను పూర్తిగా రద్దు చేసి మణిపుర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టగా వాయిదాలపర్వం చోటుచేసుకుంది. మొదట ఉదయం 11 గంటలకు సమావేశమైన ఉభయసభలు.. ఇటీవల మరణించిన సభ్యులకు నివాళులర్పించాయి. తర్వాత రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు, లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే మణిపుర్ అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. తక్షణమే ఈ అంశంపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కఢ్‌ను డిమాండ్ చేశారు. స్వల్పకాలిక చర్చ కోసం ఎనిమిది మంది సభ్యులు ఇచ్చిన నోటీసులను ఆయన అంగీకరించగా... 267 కింద చర్చ చేపట్టాలంటూ అన్ని విపక్షాల సభ్యులు ఆందోళనకు దిగారు.
ఈ అంశంపై చర్చకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజ్యసభాపక్ష నేత పీయూష్ గోయల్ తెలిపారు. సభా కార్యకలాపాలన్నింటినీ రద్దుచేసి మణిపుర్ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మొదట ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని ఆయన పట్టుబట్టారు. తృణమూల్ సభ్యుడు డెరెక్ ఒబ్రియెన్ కూడా ఇదే విధంగా చర్చకు డిమాండ్ చేశారు. తక్షణమే ప్రధాని మోదీ ప్రకటన సహా చర్చ కోసం విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేయగా సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించగా శుక్రవారానికి వాయిదా పడింది.
లోక్‌సభలోనూ అదే తీరు..
మణిపుర్ ఘటనపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ కూడా శుక్రవారానికి వాయిదా పడింది. సభా కార్యకలాపాలను రద్దుచేసి మణిపుర్ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై చర్చకు సిద్ధమన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి... చర్చ ప్రారంభిస్తే హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేస్తారని తెలిపారు. అయినప్పటికీ విపక్షాలు ఆందోళన కొనసాగించగా సభ శుక్రవారానికి వాయిదా పడింది.