Manipur issue in parliament : వరసగా 8వ రోజూ మణిపుర్ అంశం పార్లమెంటులో వాయిదాలకు దారితీసింది. మణిపుర్ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడం వల్ల సభా కార్యకలాపాలకు విఘాతం కలిగింది. సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశంకాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే మణిపుర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేయడం వల్ల సభ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్య పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విపక్షాల నినాదాల మధ్యే సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది. తర్వాత మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది.
Parliament Monsoon session 2023 : మణిపుర్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టగా.. మధ్యాహ్నం 2 గంటలకు చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. నిబంధన 267 కింద వెంటనే మణిపుర్ అంశంపై చర్చ జరగాలని.. విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్ ఎంత సర్దిచెప్పినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తర్వాత మూడు సార్లు వాయిదా పడిన రాజ్యసభ చివరకు మంగళవారానికి వాయిదా పడింది.
'చర్చ నుంచి పారిపోయారు'
మణిపుర్ అంశంపై చర్చకు విపక్షం సిద్ధంగా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వెలుపల అన్నారు. ఈ విషయం పార్లమెంట్లో ప్రస్తావనకు రాగానే.. చర్చల నుంచి విపక్షాలు పారిపోయాయని ఆరోపించారు. మణిపుర్ అంశమనేది విపక్షాలకు కేవలం రాజకీయమేనని అన్నారు. ఈ విషయం పార్లమెంట్లో నిరూపితమైందని చెప్పారు. సమస్యపై నిజంగా ఆందోళన ఉంటే చర్చలో పాల్గొనేవారని విపక్ష ఎంపీలకు నిర్మలా సీతారామన్ చురకలు అంటించారు.