వచ్చే 150 ఏళ్ల అవసరాలను తీర్చేలా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా వెల్లడించారు. పాత పార్లమెంటు భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోనందునే 64,500 చ.మీటర్ల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవన పురోగతి వివరాలు, ఫొటోలను ఆయన తొలిసారి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
"21వ శతాబ్దపు కలలతోపాటు ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపంగా నిర్మిస్తున్న కొత్త భవనాన్ని 21 నెలల్లో పూర్తిచేస్తాం. సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ త్రిభుజాకార డిజైన్ రూపొందించాం. భూకంపాలను తట్టుకొనేలా దీన్ని తీర్చిదిద్దడంతోపాటు జడ్, జడ్ ప్లస్ సెక్యూరిటీ అవసరాలకు తగ్గట్టు, పర్యావరణ అనుకూలంగా నిర్మాణం జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభలు సమావేశమైనప్పుడు ఒకేసారి 1,272 మంది సభ్యులు ఆసీనులు కావొచ్చు. దీని నిర్మాణం కోసం ఇప్పటివరకు 5.35 లక్షల మానవ పనిదినాలు సృష్టించాం."
-- దుర్గాశంకర్ మిశ్రా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి
లోయర్ గ్రౌండ్‌ఫ్లోర్, గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్లాబ్స్ నిర్మించే పని మొదలైందని.. పని వాతావరణం విషయంలో టాటా గ్రూప్ అత్యుత్తమ చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటివరకు 16 వేల మెట్రిక్ టన్నుల సిమెంట్, 10వేల మెట్రిక్ టన్నుల రీ ఇన్‌ఫోర్స్‌మెంట్ స్టీల్‌ను వినియోగించామని తెలిపారు.
2,180 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నారని.. ఈ అద్భుత సౌధం 2022లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే సమయానికి, శీతాకాల సమావేశాలకల్లా సిద్ధమవుతుందని మిశ్ర ప్రకటించారు.
ఇదీ చదవండి : Central Vista: 'ఆడంబరం కాదు.. అత్యవసర ప్రాజెక్టు'