Parliament Budget session 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిర్ణయించిన షెడ్యూల్‌కు ఒకరోజు ముందే సమావేశాలు ముగియడం గమనార్హం. గురువారం సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాలను ముగిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. రాజ్యసభలో మాత్రం చివరి రోజు కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. సభ వాయిదా ప్రకటనను చదివే సమయంలో కాంగ్రెస్, శివసేన ఎంపీలు నినాదాలు చేశారు. భాజపా నేత కిరీటి సోమయ్య అక్రమ నిధుల మళ్లింపు విషయంపై చర్చ జరపాలని శివసేన డిమాండ్ చేయగా.. కాంగ్రెస్ అందుకు మద్దతు పలికింది. ధరల పెరుగుదలపై చర్చ జరపలేదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు విడతల్లో సమావేశాలు నిర్వహించారు. తొలి విడత ఫిబ్రవరి 11న ముగిసింది. మొదటి దశ సమావేశాల్లోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొద్దిరోజుల విరామం తర్వాత ఉభయ సభలు.. మార్చి 14న రెండో విడత కోసం సమావేశమయ్యాయి. ఏప్రిల్ 8 వరకు ఈ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. ఈ సమావేశాల్లో బడ్జెట్‌తో పాటు కీలక బిల్లులను కేంద్రం ఆమోదించుకుంది.
రాజ్యసభ పనితీరు భేష్: ఈ సమావేశాల్లో రాజ్యసభ మెరుగైన పనితీరు కనబరిచింది. 99.80 శాతం ఉత్పాదకతను సాధించిందని అధికారులు తెలిపారు. 10 నిమిషాల తేడాతో వంద శాతం ఉత్పాదకత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. 2017 వర్షాకాల సమావేశాల తర్వాత రాజ్యసభ పనితీరు ఇంత మెరుగ్గా ఉండటం ఇదే తొలిసారి.
• షెడ్యూల్డ్ సిట్టింగ్ సమయం 127 గంటల 54 నిమిషాలు కాగా.. సభ 127 గంటల 44 నిమిషాలు పనిచేసింది. సభ ఈ పది నిమిషాలు భేటీ అయి ఉంటే రికార్డు సాధించేది.
• 29 సార్లు సమావేశం కావాల్సి ఉండగా.. రాజ్యసభ 27 సార్లు భేటీ అయింది. తొలి విడతలో 10 సార్లు సమావేశమైంది. హోలీ, శ్రీరామ నవమి నేపథ్యంలో రెండు సార్లు భేటీ కాలేకపోయింది.
• వరుసగా 12 భేటీలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగాయి. గత మూడేళ్లలో ఇలా జరగడం తొలిసారి. ఆరు సార్లు సభ ముందస్తుగా వాయిదా పడింది. 11 సార్లు షెడ్యూలు సమయానికి మించి భేటీ అయింది.
• ఈ సమావేశాల్లో రాజ్యసభ 11 బిల్లులను ఆమోదించింది. సామూహిక విధ్వంసక ఆయుధాలు, సరఫరా వ్యవస్థల బిల్లును గురువారం సభలో ప్రవేశపెట్టారు.
• అవాంతరాలు, వాయిదాల కారణంగా రాజ్యసభ 9 గంటల 26 నిమిషాల విలువైన సమయాన్ని కోల్పోయింది. అయితే, అదనంగా 9 గంటల 16 నిమిషాలు భేటీ అయింది.
• రైల్వే, కార్మిక, ఉద్యోగ, ఈశాన్య అభివృద్ధి శాఖ, గిరిజన వ్యవహారాల శాఖలకు సంబంధించిన అంశాలపై రాజ్యసభ 22 గంటల 34 నిమిషాలు చర్చించింది. గడిచిన 12 ఏళ్లలో ఇదే రికార్డు. ఈ ఐదు శాఖల అంశాలపై 2010లో ఈ స్థాయిలో చర్చించారు.
• మొత్తం సమయంలో 37 శాతాన్ని చర్చలు, బడ్జెట్, నాలుగు శాఖల పనితీరు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి వెచ్చించారు. ప్రభుత్వ బిల్లులపై చర్చకు 23 శాతం, ప్రజా ప్రాధాన్యం ఉన్న అంశాలకు 10 శాతం సమయాన్ని కేటాయించారు.
సభ వాయిదా అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ములాయంసింగ్ యాదవ్ కాసేపు పార్లమెంటు ఆవరణలో సమావేశమై వేర్వేరు అంశాలపై మాట్లాడుకున్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారుల్ని 'బలి' ఇచ్చిన పెదనాన్న- 'ఎగ్జామ్ ఫెయిల్' భయంతో నాన్న హత్య!