బిహార్ పదవ తరగతి పరీక్షల నిర్వహణలో మెట్రిక్యులేషన్ బోర్డు వ్యవహరిస్తోన్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షల నిర్వహణలో సమయ నిబంధన అమలు పేరిట బోర్డు అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని తల్లితండ్రులు మండిపడుతున్నారు. బిహార్ భోజ్పురిలోని హర్ప్రసాద్ దాస్ జైన్ పాఠశాల వద్ద ఆలస్యంగా వచ్చారన్న కారణంగా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో తల్లితండ్రులు, పోలీసుల మధ్య చెలరేగిన వాగ్వాదం క్రమంగా తీవ్ర ఘర్షణలకు దారితీసింది.
ప్రారంభానికి ముందే..
పరీక్ష ప్రారంభ సమయానికి ముందే గేట్లు మూసేసి విద్యార్థులను అనుమతించకపోవడం పట్ల ఆగ్రహం చెందిన తల్లితండ్రులు గేటుపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో పరీక్ష కేంద్రం కాస్త రణరంగాన్ని తలపించింది. ఉదయం 9.30కి పరీక్ష ప్రారంభం కానుండగా.. 9.20కే గేట్లు మూసేశారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసుల వాదన మరోలా ఉంది. 9.30 తర్వాతే గేట్లు మూశామని.. అయినా ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థుల తల్లితండ్రులు గొడవకు దిగారని చెబుతున్నారు.
బుధవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవాప్తంగా 1475 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది.
ఇదీ చదవండి: బిహార్లో 'హాథ్రస్' తరహా ఘటన