మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ ఉపసంహరించుకున్నారు. హైకోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కేసులో తొలుత హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీం కోర్టుకు ఎందుకు వచ్చారని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమే అయినప్పటికీ.. తొలుత హైకోర్టును సంప్రదించాల్సిందేనని పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు బుధవారమే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు పరమ్ వీర్ సింగ్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు.
పరమ్ వీర్ సింగ్ పిటిషన్ ఇదీ..
హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రతినెలా 100 కోట్లు వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారని సీఎంకు లేఖ రాశారు పరమ్ వీర్ సింగ్. ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో తన బదిలీని కూడా సవాలు చేశారు.
ఇదీ చదవండి:'మహా'లో లేఖ రచ్చ- ఠాక్రే సర్కార్‌పై ఒత్తిడి!