Palwal Army Joint Family: ఆధునిక ప్రపంచంలో చాలా మంది చిన్న కుటుంబాలకే పరిమితమవుతున్నారు. కానీ హరియాణా పల్వాల్ జిల్లాలోని ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 38 మంది కలిసి జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సైన్యానికి అంకితమైన ఆ కుటుంబం.. నేడు దేశంలో 'ఆర్మీ ఫ్యామిలీ'గా గుర్తింపు తెచ్చుకుంది. కుటుంబంలో 17 మంది పిల్లలతో కలిపి మొత్తం 38 మంది సభ్యులున్నారు. మొత్తం 9 మంది సైన్యంలో పనిచేశారు. ప్రస్తుతం ఇంకా ఆరుగురు సాయుధ దళాల్లో దేశానికి సేవ చేస్తున్నారు.
70 ఏళ్ల క్రితం జిల్లాలోని అసావత గ్రామంలో రాంపాల్ హవల్దార్తో ఈ ఉమ్మడి కుటుంబానికి పునాది పడింది. ఆయన సైన్యంలో పనిచేశారు. రాంపాల్ మరణానంతరం ఆయన భార్య దాదీ బటాసో కుటుంబ బాధ్యతలు చేపట్టారు. ఈ దంపతులకు.. శ్యామ్వీర్, రాంవీర్, ఓంవీర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి.. ఏడుగురు కొడుకులు, ఓ కుమార్తె. అందరికీ వివాహాలు అయ్యాయి. ఏడుగురిలో.. ఆరుగురు కుమారులు సైన్యానికి సేవచేస్తున్నారు. శ్యామ్వీర్, రాంవీర్ కూడా సైన్యంలో పనిచేశారు. అందుకే ఈ కుటుంబాన్ని పల్వార్ ఆర్మీ కుటుంబంగా పేర్కొంటారు. 85 ఏళ్ల నానమ్మే కుటుంబ పెద్దగా వ్యవహరిస్తారు.
'మా నాన్న ఆర్మీలో పనిచేశారు. ఆయన చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. మేము మా పిల్లల్ని కూడా సైన్యంలోకి పంపించాము. మా ఇంటి పెద్దగా మా అమ్మ ఉంది. అందరం ఒకే పొయ్యిమీద వండుకుని తింటాం. ఎవరికి ఏది కావాలన్నా మా అమ్మే చూసుకుంటుంది.'
- శ్యామ్వీర్, రాంపాల్ రెండో కుమారుడు
Joint Family in India: ఇంట్లో అన్నీ పనులను చిన్నా, పెద్దా అందరం కలిసి పనిచేస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబంతో ప్రేమానురాగాలు, పరోపకారం వర్థిల్లుతాయని అన్నారు. ఇంట్లో కోడళ్లు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినా.. అందరూ కలిసిమెలిసి ఉంటారని శ్యామ్వీర్ తెలిపారు. ఆర్మీ తమకు క్రమశిక్షణతో బతకడం నేర్పిందని చెప్పారు. కుటుంబంలో కష్టాలొచ్చినా.. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'టీకా తీసుకుంటే నా 8 మంది పిల్లలేంగాను?'.. వీడియో వైరల్