Pakistan Missile Retaliation: భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఒక క్షిపణి పొరబాటుగా పాకిస్థాన్ భూభాగంలో పడిన ఘటన ఇరు దేశాల మధ్య మరోసారి వివాదాలకు తెరలేపింది. సాంకేతిక వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని భారత్ చెప్పినప్పటికీ.. పాక్ దీనిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు ప్రతిచర్యగా దాయాది దేశం భారత్‌పైకి క్షిపణిని ప్రయోగించాలని సిద్ధమైనట్లు తాజాగా తెలిసింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది.
ఇందుకోసం పాకిస్థాన్ ప్రణాళికలు కూడా రూపొందించినట్లు సమాచారం. కానీ, క్షిపణి ప్రయోగం తర్వాత పరిణామాలను ప్రాథమికంగా అంచనా వేసి ఈ నిర్ణయంపై పాక్ వెనక్కి తగ్గిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు ఆ కథనం తెలిపింది. అయితే ఈ వార్తలపై అటు భారత రక్షణశాఖ నుంచి గానీ, పాక్ నుంచి గానీ ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.
ఈ నెల 9వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వాయుసేన స్థావరంలో సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తుండగా.. ఓ క్షిపణి గాల్లోకి లేచి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస ప్రాంతాలు ధ్వంసమవ్వగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిపై నిన్న పార్లమెంట్‌లో ప్రకటన కూడా చేశారు.
కాగా.. రక్షణ మంత్రి ప్రకటనపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని, ఉమ్మడి విచారణ జరపాలన్న తమ డిమాండుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన క్షిపణి వార్‌హెడ్ సామర్థ్యం గలదని, అణుసామర్థ్యం గల రెండు దేశాల మధ్య ఈ సంఘటన యుద్ధానికి దారితీస్తే ఎలాగని ప్రశ్నించారు. ఎంతో తీవ్రమైన ఈ విషయంలో అమెరికా సహా అంతర్జాతీయ సమాజం స్పందన చూసి విస్తుపోతున్నట్లు ఖురేషి తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి, భద్రతామండలి అధ్యక్షుడికి ఇదే విషయమై లేఖలు రాసినట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనపై అమెరికా స్పందిస్తూ.. ఇది కాకతాళీయంగా జరిగిన ప్రమాదమే తప్ప ఇందులో మరెలాంటి కోణం కన్పించడం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి : 'పెద్ద పొరపాటు జరిగింది.. కానీ అదృష్టవశాత్తూ...'