భారత్-చైనా మధ్య ఘర్షణలు డ్రాగన్ దేశానికి మంచివి కావని వైమానిక దళ ప్రధానాధికారి ఆర్.కె.ఎస్ భదౌరియా అన్నారు. చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ ఆర్.కె.ఎస్ భదౌరియా ఆ దేశానికి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో జరిగే ఎలాంటి యుద్ధంలో అయినా భారత్ విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సవాళ్లు, వాయుసేన బలం అన్న అంశంపై జరిగిన వెబినార్‌లో పాల్గొన్న భదౌరియా సాంకేతికతను మరింత పెంచుకుంటున్నట్లు తెలిపారు.
దేశీయ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు వాయుసేనకు అవసరమైన వాటినిన దేశంలోనే తయారు చేసుకుంటున్నట్లు వివరించారు. భారత్‌తో ఎలాంటి తీవ్ర వివాదమైనా అంతర్జాతీయ స్ధాయిలో చైనాకు మంచిది కాదని భదౌరియా అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాలను వైమానిక దళం కాపాడుతుందని తెలిపారు. అటు, పాకిస్థాన్ చైనా విధానాల్లో బంటుగా మారిందని ఆయన తెలిపారు.
"ఉప ఖండంలో ప్రమాద పరిస్ధితుల్లో వేగంగా ప్రతిస్పందించడం సహా సమర్ధవంతమైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ పశ్చిమ సరిహద్దులు, ఇతర సరిహద్దుల వద్ద సంప్రదాయ సంక్షోభ పరిష్కార దశలో పరిస్ధితులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు బలమైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవాలి. చైనాను దృష్టిలో పెట్టుకుని ఈ పనులపై మరింత దృష్టి సారించి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇటీవల జరిగిన పరిణామాల ఆధారంగా భవిష్యత్తు యుద్ధాల కోసం సమకూర్చుకోవాల్సిన వాటిపై పునఃసమీక్ష చేస్తున్నాం. అన్ని రకాల యుద్ధాల్లో భారత వైమానిక దళం విజయం సాధిస్తుందని చెప్పగలను. దేశ ప్రయోజనాలను కాపాడడంలో వైమానిక దళం కీలకపాత్ర పోషిస్తుంది."
-ఆర్.కె.ఎస్ భదౌరియా, వైమానిక దళ ప్రధానాధికారి