Oxfam report Indian wealth: భారత్‌లో ఆర్థిక అసమానతలు, కుబేరుల సంపదపై ఆక్స్‌ఫామ్ ఆసక్తికర నివేదిక రూపొందించింది. దేశంలోని పది మంది అత్యంత ధనవంతులు తల్చుకుంటే.. 25 ఏళ్ల పాటు భారత్‌లోని పిల్లలందరికీ ఉన్నత విద్య అందించగలరని పేర్కొంది. కరోనా సమయంలో ఈ కుబేరుల సంపద రెట్టింపునకు మించి పెరిగిందని తెలిపింది.
India richest people wealth
ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్న దావోస్ అజెండా సమావేశం తొలిరోజులో భాగంగా వార్షిక అసమానతా సర్వే వివరాలను ఆక్స్‌ఫామ్ ఇండియా వెల్లడించింది. పది మంది కుబేరులపై అదనంగా ఒక శాతం పన్ను విధిస్తే.. దేశంలో 17.7 లక్షల అదనపు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది. ఇదే విధంగా 98 సంపన్న కుటుంబాలపై పన్ను(ఒకశాతం అదనంగా) విధిస్తే ప్రపంచంలోని అతిపెద్ద బీమా పథకమైన 'ఆయుష్మాన్ భారత్'కు ఏడేళ్ల పాటు సరిపోయేంత బడ్జెట్ సమకూరుతుందని లెక్కగట్టింది. కరోనా రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు భారీగా డిమాండ్ పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది.
Oxfam annual inequality survey
నివేదికలోని ముఖ్యాంశాలు
- భారత్‌లోని 142 మంది బిలియనీర్ల వద్ద రూ.53 లక్షల కోట్ల సంపద పోగుపడి ఉంది.
- కుబేరుల జాబితాలోని తొలి 98 మంది సంపద రూ.49 లక్షల కోట్లు. దేశంలో అట్టడుగున ఉన్న 55.5 కోట్ల మంది ప్రజల సంపదకు ఇది సమానం.
- పది మంది కుబేరులు దేశ సంపదలో 45 శాతాన్ని గుప్పిట పెట్టుకుంటే.. కిందిస్థాయిలో ఉన్న 50 శాతం మంది జనాభా 6 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు.
Wealth Inequality India Oxfam
- దేశంలోని పది మంది అగ్ర కుబేరులు రోజుకు ఒక మిలియన్ డాలర్లు(రూ.7.43 కోట్లు) ఖర్చు చేస్తే.. వారి సంపద మొత్తం కరిగిపోవడానికి 84 ఏళ్లు పడుతుంది.
- బిలియనీర్లు, మల్టీ మిలియనీర్లపై వార్షిక సంపద పన్ను విధిస్తే.. ఏటా రూ.5.82 లక్షల కోట్లు వసూలవుతాయి. ఈ నిధులతో ప్రభుత్వ వైద్య బడ్జెట్ 271 శాతం పెరుగుతుంది. ఈ నిధులతో దేశంలోని కుటుంబాల వైద్య ఖర్చులన్నీ భరించిన తర్వాత.. రూ.2.2 లక్షల కోట్లు ఇంకా మిగులుతాయి.
- అగ్రస్థానంలో ఉన్న 100 మంది బిలియనీర్ల సంపదతో జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకాన్ని 365 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు.
- 98 సంపన్న కుటుంబాలపై 4 శాతం సంపద పన్ను విధిస్తే.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రెండేళ్ల పాటు నిధులు సమకూరుతాయి.
- 98 సంపన్న కుటుంబాల మొత్తం సంపద విలువ దేశ బడ్జెట్ కంటే 41 శాతం అధికం.
- 98 మంది బిలియనీర్లపై ఒక శాతం సంపద పన్ను విధిస్తే.. విద్యా శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం వార్షిక వ్యయానికి సరిపోతుంది.
- అదే.. 4 శాతం పన్ను విధిస్తే 17 ఏళ్ల పాటు మధ్యాహ్న భోజన పథకానికి నిధులు సమకూరుతాయి. లేదా ఆరేళ్ల పాటు సమగ్ర శిక్ష్య అభియాన్‌ను కొనసాగించవచ్చు. లేదా మిషన్ పోషన్ 2.0 పథకానికి పదేళ్ల పాటు నిధులు అందించవచ్చు.
ఆర్థిక సంక్షోభంగా కరోనా...
Covid Economic crisis : కరోనా మహమ్మారి ప్రారంభంలో వైద్య సంక్షోభంగా ఉండేదని, ఇప్పుడది ఆర్థిక సంక్షోభంగా మారిందని ఆక్స్‌ఫామ్ ఉద్ఘాటించింది. విద్య, వైద్యం మీద ప్రభుత్వాలు తగినంత ఖర్చు చేయకపోవడం వల్ల.. ఈ రంగాలు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయాయని పేర్కొంది. సామాన్యుడికి ఈ సేవలు అందనంత దూరం వెళ్తున్నాయని తెలిపింది.
"ప్రభుత్వాలు ఆదాయం అందించే మార్గాలను పునస్సమీక్షించుకోవాలి. పన్ను వసూళ్ల విషయంలో ప్రగతిశీల విధానాలు అవలంబించాలి. విద్య, వైద్యాన్ని సార్వత్రిక హక్కుగా పరిగణించి.. అసమానతలు తగ్గించే విధంగా ఈ రంగాలపై పెట్టుబడులు పెంచాలి. ఈ రంగాల ప్రైవేటీకరణను నిరోధించాలి. సంపద పన్నును పునఃప్రవేశపెట్టి.. పెద్దల దగ్గరి నుంచి వసూలు చేసి విద్య, వైద్యంపై పెట్టుబడులు పెట్టాలి. ఇందుకోసం తాత్కాలిక ఒక శాతం సర్‌ఛార్జ్‌ను వసూలు చేయాలి."
-ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక
మహిళల విషయంలో...
Indian Women job losses Covid: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 28 శాతం మహిళలు ఉన్నారని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక పేర్కొంది. ఫలితంగా తమ ఆదాయంలో మూడింట రెండింతలు కోల్పోయారని తెలిపింది. 2021 బడ్జెట్లో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధులు చాలా తక్కువ అని గుర్తు చేసింది. భారత బిలియనీర్ల జాబితాలోని చిట్టచివరి 10 మంది సంపదతో పోలిస్తే.. బడ్జెట్ కేటాయింపులు సగమేనని లెక్కేసింది. పది కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులపై రెండు శాతం పన్ను విధిస్తే.. ఈ మంత్రిత్వ శాఖ బడ్జెట్ 121 శాతం మేర పెరుగుతుందని తెలిపింది.
99 శాతం పన్ను విధించండి..
99 per cent tax on Billionaire: మరోవైపు, ఆక్స్‌ఫామ్ అంతర్జాతీయ విభాగం సైతం కీలక నివేదిక విడుదల చేసింది. కరోనా నివారణకు పలు సూచనలు చేసింది. ప్రపంచంలోని బిలియనీర్లందరిపై 99 శాతం వన్‌టైమ్ ట్యాక్స్ విధించాలని ప్రతిపాదించింది. ఈ నిధులను టీకా ఉత్పత్తిని పెంచి.. ప్రపంచంలోని పేద ప్రాంతాలకు పంపిణీ చేయాలని సూచించింది. టీకా తయారీపై ఐపీ నిబంధనలను సరళీకృతం చేయాలని పిలుపునిచ్చింది.
- 2020 మార్చి తర్వాత ప్రతి రోజు ఓ బిలియనీర్ పుట్టుకొస్తున్నారు.
- అగ్రస్థానంలో ఉన్న పది మంది ప్రపంచ కుబేరుల సంపద రెట్టింపు పెరిగి రూ.కోటి కోట్లకు చేరింది.
- ఈ పది మంది కుబేరుల సంపద.. ప్రపంచంలో కింది స్థాయిలో ఉన్న 310 కోట్ల మంది సంపద కన్నా ఆరు రెట్లు ఎక్కువ.
- కరోనా సమయంలో 16 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుకున్నారు.
ఇదీ చదవండి: