Lalu yadav health: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మందులు అధిక మోతాదులో ఇవ్వడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు బుధవారం రాత్రి ఆయన్ను ప్రత్యేక ఎయిర్ అంబులెన్సులో దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అయితే, లాలూ శరీరంలో కదలికలు లేవని తేజస్వీ యాదవ్ తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటే సింగపూర్‌కు తరలించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించడం వల్ల మరో రెండు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.
''మెరుగైన చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువచ్చాం. ఇక్కడి వైద్యులకు ఆయన పూర్తి ఆరోగ్య పరిస్థితిపై అవగాహన ఉంది. ప్రస్తుతానికి ఆయన శరీరంలో ఎలాంటి కదలికలు లేవు. మూడు ఎముకలు విరగడం, మందులు అధికంగా అందించడం వల్ల చికిత్స అందించడం సమస్యగా మారింది.''
-తేజస్వీ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు
సింగపూర్‌కు లాలూ!: లాలూ పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని ఇదివరకే తేజస్వీ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి చికిత్స కోసం గత నెలలోనే జార్ఖండ్ హైకోర్టు నుంచి లాలూ అనుమతి తీసుకున్నారు. లాలూ కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు బిహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు దిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు.
జారిపడిన గాయాలతో పాటు ఆయన్ను ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు లాలూ. మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ లాలూ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లాలూ పట్నాలోని ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: 'లాలూ శరీరంలో కదలికలు లేవు.. చెకప్ అయ్యాక దానిపై నిర్ణయం!'