దేశంలోని వయోజనుల్లో 50 శాతానికిపైగా జనాభాకు కొవిడ్-19 వ్యాక్సిన్(కనీసం ఒక డోసు) అందించినట్లు కేంద్రం తెలిపింది(covid vaccine india update). అందులో 16శాతం మంది రెండు డోసులు(Corona vaccine) తీసుకున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా గురువారం నాటికి మొత్తం 67కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది.
సిక్కిం, దాద్రా, నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్లలో వయోజనులందరూ కనీసం ఒక డోస్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశామని, ఆగస్టులో రోజుకు సగటున 59.29 లక్షల డోసుల చొప్పున 18.38 కోట్ల డోసులు పంపిణీ(Vaccination) చేసినట్లు చెప్పారు. ఆగస్టు చివరి వారంలో రోజుకు సగటున 80.27 లక్షల డోసులు అందించామన్నారు.
"ఇది గొప్ప విజయం. ఆరోగ్య కార్యకర్తలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల భాగస్వామ్యం లేకుండా అది సాధ్యం కాదు. ఆగస్టు 27, 31వ తేదీల్లో కోటికిపైగా డోసులు పంపిణీ చేశాం."
- రాజేశ్ భూషణ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి.
దేశవ్యాప్తంగా 99శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు తొలి డోసు తీసుకున్నారని, 84 శాతం మంది అర్హులైనవారు రెండో డోసు పొందినట్లు భూషణ్ చెప్పారు. 100 శాతం కొవిడ్ వారియర్స్ తొలి డోసు తీసుకోగా.. 80 శాతం మంది రెండో డోసు వేసుకున్నారని తెలిపారు.
80 శాతం మంది పాఠశాల సిబ్బందికి టీకా
దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో 80 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. టీచర్లు, సిబ్బందికి వ్యాక్సినేషన్‌పై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్లు పేర్కొంది. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో సిబ్బందికి టీకా అందించటం అతిపెద్ద అంశంగా తెలిపింది.
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్లో దూసుకెళ్తున్న భారత్- మళ్లీ కోటి డోసులు