ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్ సరకులు పొందుతున్న లబ్ధిదారుల కోసం కేంద్రం రూపొందించిన 'మేరా రేషన్ యాప్'ను ఇప్పటివరకు ఐదు లక్షలమందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ తెలిపింది. 32 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమల్లో ఉన్నట్లు పేర్కొంది.
దీనిని ప్రత్యేకంగా ఉపాధి కోసం సొంత ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి వలస వెళ్లే వారి కోసం కేంద్రం రూపొందించింది. ఈ యాప్‌తో పీడీఎస్ ద్వారా రేషన్ పొందుతున్న వారు దగ్గరలోని రేషన్ దుకాణం పేరు, లభించే సరకులు మొదలైన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా 'వన్ నేషన్ వన్ రేషన్' కార్డు కింద రేషన్ కార్డు పోర్టబులిటీని కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా.. త్వరలో 14 భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. వలసదారులు తమ వివరాలను పొందుపర్చడం సహా ఆధార్ సీడింగ్ వివరాలనూ తెలుసుకోవచ్చన్నారు. ఆధార్ లేదా రేషన్ కార్డు నంబర్ ద్వారా యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు.
ఇదీ చూడండి: రెండు గంటల్లోపు ప్రయాణమైతే ఆహారం బంద్!