Ram Nath Kovind news: తన పదవీకాలంలో దేశవ్యాప్తంగా ఎంతోమందిని కలిసిన తర్వాత సామాన్య ప్రజలే నిజమైన దేశ నిర్మాతలన్న భావన మరింత బలపడిందని భారత 14వ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. తన పదవీకాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆయన జాతినుద్దేశించి చివరిసారిగా ప్రసంగించారు. "నా విధి నిర్వహణను విజయవంతంగా పూర్తిచేయడానికి అన్ని వర్గాలు పూర్తి సహకారం అందించాయి. విదేశీ పర్యటనలో ప్రవాస భారతీయులను కలిసేటప్పుడు మాతృభూమిపట్ల భక్తిని, లోతైన ప్రేమనూ చవిచూశాను. దేశ అత్యున్నత పౌర పురస్కారాల ప్రదానోత్సవ సమయంలో అసాధారణ ప్రతిభావంతులను కలిసే అదృష్టం లభించింది. చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలతోపాటు ఇతర జీవజాతులకు భద్రత కల్పించి సంరక్షించుకోవాలి. ప్రథమ పౌరుడిగా ఏక వాక్యంలో దేశప్రజలకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఇదే చెబుతాను. పర్యావరణాన్ని, భూమిని, గాలిని, నీటిని భవిష్య తరాల కోసమైనా జాగ్రత్తగా చూసుకోవాలి" అని చెప్పారు.
ప్రజాస్వామ్య అంతర్గత శక్తికి నిదర్శనమిది
"నేను చిన్న గ్రామంలో సాధారణ బాలుడిగా జీవితాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేశానికి స్వాతంత్య్రం లభించి కొన్నేళ్లే అయింది. దేశ పునర్నిర్మాణం కోసం అప్పట్లో ప్రజల్లో కొత్త ఉత్తేజం కనిపించేది. దేశ నిర్మాణంలో ఏదో ఒకరోజు నావంతు పాత్ర పోషించాలన్న భావన నా మనసులోనూ ఉద్భవించింది. యూపీలో పరౌంఖ్ (కాన్పుర్ దెహాత్) అనే సాధారణ గ్రామంలో మట్టిగోడల ఇంటి నుంచి వచ్చిన రామ్‌నాథ్ కోవింద్ అనే వ్యక్తికి ఇప్పుడు జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కడం పూర్తిగా మన ప్రజాస్వామ్య సంస్థలకున్న అంతర్గత శక్తికి నిదర్శనం.
రాజ్యాంగమే దారి దీపం
మనం ఇప్పుడు పయనిస్తున్న ప్రజాస్వామ్య పటాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ రూపొందించింది. రాజ్యాంగమే ఇప్పుడు మనకు దారి దీపంలా పనిచేస్తోంది. రాజ్యాంగాన్ని స్వీకరించే ముందు దాని నిర్మాణ సభలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ముగింపు వ్యాఖ్యలు చేస్తూ- రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగానూ మార్చాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు జీవన సిద్ధాంతాలుగా ఉండటమే సామాజిక ప్రజాస్వామ్యం.
శక్తిమేరకు పనిచేశా
గత అయిదేళ్లలో నా శక్తి మేరకు విధులు నిర్వర్తించాను. డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్‌కలాం అడుగుజాడల్లో వెళ్తున్నానన్న స్పృహతో ముందడుగు వేశాను. ఇప్పటికీ నాకు ఏదైనా అనుమానం వస్తే గాంధీజీ వైపే చూస్తాను. ఏదైనా పనిచేయడానికి ఉద్యుక్తులయ్యేముందు అది ఈ దేశంలో అత్యంత పేదకు ఏమైనా మేలు చేస్తుందా అన్నది ఆలోచించు అన్న ఆయన సలహాయే చెవుల్లో మార్మోగుతుంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ మహాత్ముడి బోధనల గురించి కాసేపైనా ఆలోచించాలని కోరుతున్నా. 21వ శతాబ్దం మన దేశానిదే అవుతుంది" అని కోవింద్ పేర్కొన్నారు. కోవింద్ ప్రసంగం ఉత్తేజభరితమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జాతి పురోగతిపై ఆయనకున్న తపనను ఇది చాటుతోందన్నారు.
ప్రాథమిక సౌకర్యాలతోనే సంతోషానికి పునాది
"ప్రజలు సంతోషంగా జీవించాలంటే అందరికీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి. వనరుల కొరత రోజుల నుంచి ఇప్పుడు ఎంతో దూరం వచ్చాం. అభివృద్ధి, వివక్షకు తావులేని సుపరిపాలన వల్లే ఈ మార్పు సాధ్యమైంది. ప్రాథమిక సౌకర్యాల కల్పన పూర్తయిన తర్వాత ప్రజలు తమ శక్తిసామర్థ్యాలను తెలుసుకొని, నచ్చింది చేస్తూ సంతోషంగా జీవించేలా చూడడం ముఖ్యం. అందుకు విద్య చాలా ముఖ్యం. జాతీయ విద్యావిధానం దీనికి దోహదపడుతుందని నమ్ముతున్నా.
జీవితంలో సంతోషకర ఘటన అదే
నేను రాష్ట్రపతి హోదాలో కాన్పుర్‌కు వెళ్లి, అక్కడ నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయుల పాదాలను తాకి వారి ఆశీర్వాదం పొందడం జీవితంలో గుర్తుండిపోయే అత్యంత సంతోషకరమైన ఘటన. సొంత గ్రామం, చదువుకున్న పాఠశాలలు, ఉపాధ్యాయులతో అనుబంధాన్ని యువతరం పెనవేసుకోవాలని కోరుతున్నా. గాంధీజీ 1915లో మాతృభూమికి తిరిగివచ్చినప్పుడు జాతీయోద్యమం ఊపందుకొంది. ఎంతోమంది గొప్ప నాయకులుండడం భారత్ అదృష్టం. ప్రపంచంలో మరే దేశానికీ ఇది లేదని నా భావన." అంటూ కోవింద్ చెప్పుకొచ్చారు.
ద్రౌపదికి కోవింద్ విందు
నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్ ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముర్ముతో పాటు, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి: