నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కుతున్నారు. కేంద్రంతో శనివారం జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగియగా.. హస్తినలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తున్నారు. 11వ రోజూ దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రీలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. ఉద్యమానికి మద్దతుగా దేశ రాజధాని సరిహద్దులకు వివిధ రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలివస్తున్నారు.
ఇదీ చూడండి: రైతు దీక్ష: నడిరోడ్డే వేదిక.. వెనకడుగే లేదిక
పంజాబ్ రైతు సంఘాల నేతలు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
భారతీయ కిసాన్ యూనియన్ లోక్ శక్తి సభ్యులు.. నోయిడా నుంచి దిల్లీకి అర్ధనగ్న నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద పెద్ద బండరాళ్లు, బారికేడ్లను అడ్డుగా పెట్టారు. గాజియాబాద్ నుంచి దిల్లీ వెళ్లే జాతీయ రహదారిని మూసివేశారు.
రహదారుల దిగ్బంధంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
పెరుగుతున్న మద్దతు..
రైతుల ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. విపక్షాలు సహా వివిధ రంగాల ప్రముఖులు తమ గళం వినిపిస్తున్నారు. రైతు సంఘాలు పిలుపునిచ్చిన మేరకు ఈ నెల 8న భారత్ బంద్‌లో పాల్గొంటామని పలు పార్టీలు ప్రకటించాయి.
- రైతులకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్.. డిసెంబర్ 8న అన్ని రాష్ట్ర, జిల్లాల తమ పార్టీ ప్రధాన కార్యాలయాల్లో నిరసన చేస్తామని స్పష్టం చేసింది. బంద్‌ను విజయవంతం చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.
- తెలంగాణలోని అధికార తెరాస కూడా భారత్ బంద్‌కు సహకరిస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
- తృణమూల్ కాంగ్రెస్ కూడా రైతులకు నైతిక మద్దతు ప్రకటించింది. భారత్ బంద్‌పై తమ నిర్ణయం వెల్లడించలేదు.
- రైతుల సమస్యలపై కేంద్రం దృష్టిసారించాలని, లేకుంటే దిల్లీకే పరిమితమైన ఆందోళనలు దేశవ్యాప్తం అవుతాయని హెచ్చరించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. రైతు సమస్యలపై చర్చించేందుకు డిసెంబర్ 9న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నట్లు స్పష్టం చేశారు.
- చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళన చేస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు.
- అన్నదాతలకు అండగా ఉంటామని తెలిపారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.
- ఆమ్ఆద్మీ, వామపక్షాలు సైతం ఇప్పటికే రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
ఇప్పటికే భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు మద్దతు తెలపగా.. తాజాగా బ్యాంక్ యూనియన్లూ తమ వైఖరిని ప్రకటించాయి. అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య(ఏఐబీఈఏ).. రైతుల సమస్యలకు పరిష్కారం తెలపాలని తమ గళం వినిపించింది. ఇతర సంఘాలూ అన్నదాతల వెంటే నిలిచాయి.
అవార్డులు వెనక్కి..
రైతులకు మద్దతు తెలిపే ప్రముఖ క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా.. ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలుగా అభివర్ణించారు. కేంద్రం ఈ చట్టాలను ఉపసంహరించుకోకుంటే తనకు గతంలో వచ్చిన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నను వెనక్కి ఇచ్చేస్తానని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: రాజీవ్ ఖేల్‌రత్న వెనక్కిచ్చేస్తా: విజేందర్ సింగ్
ఇతర క్రీడాకారులు, ప్రముఖులు కూడా పద్మశ్రీ, అర్జున అవార్డులను.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.
వేరే దేశాల్లోనూ..
భారత్‌లో రైతుల పోరాటానికి మద్దతుగా వివిధ దేశాల్లోని కర్షకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని సిక్కులు పలు నగరాల్లో శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. సాగు చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత అంశంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరపాలని.. బ్రిటన్‌లోని 36 మంది ఎంపీలు అక్కడి విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
అంతకుముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలువురు నాయకులు.. రైతులకు సంఘీభావం ప్రకటించారు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అర్ధరహితమని స్పష్టం చేసింది. వారివి అనవసర వ్యాఖ్యలని పేర్కొంది.
పార్లమెంటు సమావేశాలకు ఓకే!
రైతులు ఏ మాత్రం వెనక్కితగ్గకపోవడం వల్ల వారి డిమాండ్లపై కేంద్రం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. వ్యవసాయ చట్టాల్లో కొన్ని సవరణలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్ 9న రైతులతో.. కేంద్రం ఐదో దఫా చర్చలు జరపనుంది.