పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు ఆగడం లేదు. పెగాసస్ సహా పలు అంశాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబడటం వల్ల ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.
వెంకయ్య అసహనం
కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు సహా ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుకు అభినందనలు తెలిపిన అనంతరం.. రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రాముఖ్యత ఉన్న అంశాలను ప్రస్తావించకుండా విపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 'రోజురోజుకూ నిస్సహాయంగా తయారవుతున్నాం' అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సభ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు, లోక్‌సభలోనూ పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.
కార్గిల్ వీరులకు నివాళి
వాయిదాకు ముందు ఉభయ సభలు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు అర్పించాయి. దేశాన్ని కాపాడేందుకు సైనికుల చేసిన త్యాగాల్ని కొనియాడాయి. ఈ సందర్భంగా కొద్ది క్షణాల పాటు మౌనం పాటించాయి.
మీరాబాయికి అభినందన
అదేసమయంలో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు పార్లమెంట్ ఉభయ సభలు కృతజ్ఞతలు తెలిపాయి. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మీరాబాయి ప్రదర్శన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.
ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వెళ్లిన రాహుల్