మణిపుర్ అంశంపై లోక్‌సభ వేదికగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్.. మణిపూర్‌లో శాంతి కోసం ప్రధాని మౌనంవీడాలని డిమాండ్ చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైందన్న హస్తం పార్టీ.. రాష్ట్రపతి పాలన విధించాలని సూచించింది. విపక్షాలపై ఎదురుదాడికి దిగిన అధికార భాజపా... మణిపుర్ ఘటనపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని విమర్శలు గుప్పించింది. విపక్ష కూటమి ఇండియా లక్ష్యంగా ఆరోపణలు చేసింది.
మణిపుర్ అంశమే ప్రధాన అజెండాగా కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్... కేంద్రంపై సునిశిత విమర్శలు చేశారు. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపుర్‌కు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. మణిపుర్‌లో ప్రజాసంఘాలతో చర్చించాలని కోరారు. ప్రజా సమస్యలపై మోదీ మౌనం కొత్తేమీ కాదన్న గౌరవ్ గొగొయ్.. సాగుచట్టాలపై రైతులు ఆందోళన చేసినపుడు మౌనంగానే ఉన్నారని, అదానీపై విమర్శలు వచ్చినపుడు మౌనంగానే ఉన్నారని ఆక్షేపించారు. చైనా బలగాలు భారత్‌లోకి వచ్చినపుడు, పుల్వామా ఘటన సమయంలో కూడా మౌనంగానే ఉన్న మోదీ... తప్పులు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరని గౌరవ్ గొగొయ్ ధ్వజమెత్తారు. మణిపుర్ అంశంపై ప్రధాని మాట్లాడాలన్న గౌరవ్ గొగొయ్ అల్లర్లను అరికట్టడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఘోర వైఫల్యం చెందినట్లు ఆరోపించారు.
"ఈ దుఃఖ సమయంలో మణిపుర్‌కు ఓ సందేశం వెళ్తుంది. ఈ సభ మొత్తం మణిపుర్ వెంట ఉంది. శాంతి కోరుకుంటోంది. ప్రధానమంత్రి మోదీ మౌనవ్రతం చేపట్టారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని మోదీ మౌనవ్రతాన్ని భగ్నం చేయాలనుకున్నాం. ఆయన ఇప్పటివరకు మణిపుర్‌లో ఎందుకు పర్యటించలేదు? మణిపుర్‌పై ప్రధాని మాట్లాడటానికి దాదాపు 80రోజులు ఎందుకు పట్టింది? అది కూడా 30 సెకండ్లే మాట్లాడారు. తర్వాత కూడా మోదీ ఆవేదన వ్యక్తం చేయటం.. లేదా శాంతి కోసం పిలుపు ఇవ్వడం వంటివి చేయలేదు. ప్రధానమంత్రి ఇప్పటివరకు మణిపుర్ సీఎంను ఎందుకు బర్తరఫ్ చేయలేదు?"
-గౌరవ్ గొగొయ్, కాంగ్రెస్ ఎంపీ
'మాఫియాను పెంచిందే కాంగ్రెస్'
అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న భాజపా సభ్యుడు నిశికాంత్ దుబే.. విపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్ కేంద్రంపై పెట్టినది అవిశ్వాస తీర్మానం కాదన్న ఆయన... విపక్షాల విశ్వాస తీర్మానమని చెప్పారు. అసలు మణిపుర్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేనేలేదన్న ఆయన... అక్కడ డ్రగ్ మాఫియాను పెంచినదే హస్తం పార్టీ అని విమర్శించారు. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్, అందులోని చాలామందిని గతంలో జైలుకు పంపిందని దుబే వివరించారు. అసలు ఇండియా కూటమిలో చాలామందికి దాని అర్థమే తెలియదని దుబే ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌పైనా దుబే విమర్శలు గుప్పించారు. ఈ దశలో విపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పగా అధికారపార్టీ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం, నినాదాలు చోటుచేసుకున్నాయి.
"నిన్న రాహుల్ సభకు వస్తే ప్రపంచమంతా వచ్చినట్లు హంగామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఇంకా తీర్పు ఇవ్వలేదు. కేవలం స్టే మాత్రమే ఇచ్చింది. రాహుల్ రెండు విషయాలు చెబుతున్నారు. నేను క్షమాపణ చెప్పనని అంటున్నారు. ఎందుకు క్షమాపణ కోరతారు. మోదీ చిన్న వర్గానికి చెందిన ఓబీసీ. ఓబీసీ నుంచి పెద్దవారు ఎందుకు క్షమాపణ కోరుతారు. రెండోమాట నేను సావర్కర్‌ను కాను అంటున్నారు. 28 ఏళ్లు ఆయన జైల్లో ఉన్నారు. ఆయనతో మీకు ఎక్కడ పోలిక."
-నిశికాంత్ దుబే, భాజపా ఎంపీ
'విపక్షాలు పశ్చాత్తాప పడతాయి'
దేశాన్ని అభివృద్ధి పథంలో, శక్తివంతంగా మార్చే దిశగా తీసుకెళ్తున్న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకు ప్రతిపక్షాలు పశ్చాతాపపడతాయని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
"నరేంద్ర మోదీ నేతృత్వంలో 2047వరకు భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని దేశంలోని ప్రతి మూల ఉన్న ప్రజలు, విదేశాల్లో నివసించే ప్రవాసీయులు కూడా విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చినందుకు కాంగ్రెస్, ప్రతిపక్షాలు పశ్చాతాప పడతాయి. మీరు ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏం జరగదు. దేశానికి వ్యతిరేకంగా పని చేస్తారు మళ్లీ ఇండియా అని పేరు పెట్టుకుంటారు. దేశ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అది జరగదు."
-కిరణ్ రిజిజు, కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి
అవిశ్వాస తీర్మానంపై చర్చ బుధ, గురు వారాల్లోనూ కొనసాగనుంది. ప్రధాని ఈనెల 10న చర్చకు సమాధానం ఇవ్వనున్నారు.