పార్లమెంట్ ఉభయ సభల ప్రారంభానికి ముందు.. విపక్ష పార్టీల ఎంపీలు దిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ భేటీకి.. ఎన్సీపీ, శివసేన సహా 14 పార్టీల పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. పెగాసస్, సాగు చట్టాలు సహా పలు సమస్యలపై ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై వీరంతా చర్చించినట్లు తెలుస్తోంది.
![Opposition leaders meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12596800_e7w5cyzveaa8pdc-2.jpg)
![Opposition leaders meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12596800_e7w5cyzveaa8pdc-1.jpg)
అయితే, దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్.. ఈ సమావేశానికి గైర్హాజరైంది. ఆ పార్టీ తరపున ఎవరూ ఈ భేటీకి రాకపోవడం గమనార్హం.
చర్చ జరగాల్సిందే: రాహుల్
మరోవైపు, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొని ఎంపీలతో మాట్లాడారు. దేశంలోని ప్రధాన సమస్యలపై చర్చ విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాహుల్ పేర్కొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ద్రవ్యోల్బణం, పెగాసస్, రైతుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. సభలో వీటిపై చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
పార్లమెంటులో అంతరాయాలపై నెపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపైకి నెడుతున్నారని సమావేశంలో రాహుల్ పేర్కొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నదాతలు, దేశ భద్రత సహా ప్రజా సంబంధిత సమస్యలనే పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నామని రాహుల్ స్పష్టం చేశారని వెల్లడించాయి. దీనికి విపక్ష సభ్యులు రాహుల్కు మద్దతు పలికినట్లు చెప్పాయి.
ఇదీ చదవండి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణం