Opposition Alliance India : విపక్షాల కూటమి 'ఇండియా' మూడో సమావేశం ఆగస్టు 25, 26 తేదీల్లో ముంబయిలో జరగనుంది. ఈ సమావేశానికి శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాంగ్రెస్ మద్దతుగా నిలవనుంది. మొదటి సమావేశం పట్నాలో, రెండోది బెంగళూరులో జరిగాయి. ముంబయి సమావేశంలో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Opposition Alliance India : ఈ సమావేశంలో.. పార్టీల మధ్య కమ్యూనికేషన్ కోసం కమిటీల కూర్పు, 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం, ఎన్నికలకు ముందు ఉమ్మడి నిరసనలు, ర్యాలీలను సమన్వయం చేయడానికి మరొక ప్యానెల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు 11 మందితో సమన్వయ కమిటీపై తుది నిర్ణయానికి వచ్చినట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి. ఈ కమిటీలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్‌జేడీ, శివసేన(ఉద్ధవ్ వర్గం), ఎన్‌సీపీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ(ఎం) నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కూటమిలోని ఇతర చిన్న పార్టీలకు కమిటీలో స్థానం ఉండదని సమాచారం.
Opposition Parties Meeting : అయితే, పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం జాయింట్ సెక్రటేరియట్‌ను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కూటమి పార్టీలు తమ మధ్య ఉన్న విభేదాలను.. ముఖ్యంగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో వీలైనంత మేరకు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, నాయకత్వ సమస్యను పరిష్కరించడం కూటమి ముందున్న అనేక సవాళ్లలో ఒకటి.
మరోవైపు.. కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు.. బంగాల్‌లో వామపక్షాలు, టీఎంసీ.. పంజాబ్, దిల్లీలలో.. ఆప్, కాంగ్రెస్.. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్.. జమ్ముకశ్మీర్‌లో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించుకుని.. ఓట్ల చీలికను నిరోధించేందుకు అన్ని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని పోటీ చేయించాలని విపక్ష కూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, సీట్ల ఖరారు కీలకంగా మారనుంది.