Opposition Alliance 2024 : కాంగ్రెస్, సీపీఎం పార్టీలపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల మహా కూటమి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతుంటే.. బంగాల్లో మాత్రం కాంగ్రెస్, సీపీఎం.. బీజేపీకి వంతపాడుతున్నాయని ఆమె ఆరోపించారు. బంగాల్లో కాంగ్రెస్, సీపీఎం.. బీజేపీతో రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని మమత ధ్వజమెత్తారు. ఆదివారం కూచ్‌బిహార్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి.. ఈ మేరకు మూడు పార్టీల లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
పట్నాలో ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశం జరిగి.. కనీసం మూడు రోజులు కూడా గడవక ముందే మమతా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. గత పదిరోజుల్లో కాంగ్రెస్, సీపీఎంపై మమతా బెనర్జీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. "మేము జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి కట్టేందుకు పయత్నాలు చేస్తున్నాం. కానీ బంగాల్లోని కాంగ్రెస్, సీపీఎం మాత్రం.. బీజేపీతోనే పనిచేస్తున్నాయి. నేను ఈ అపవిత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాను" అని మమతా బెనర్జీ అన్నారు.
బంగాల్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి తోసిపుచ్చారు. బీజేపీపై పోరాటంలో మమత విశ్వసనీయత ఎప్పుడూ ప్రశ్నార్థకమేనన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇన్నేళ్లు మమతా చేసిన పోరాటం అందరికీ తెలుసన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే మార్గాలపై కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు ఉపన్యాసాలు ఇచ్చే చివరి వ్యక్తి బెనర్జీ అని సీపీఎం వ్యాఖ్యానించింది. మమతా బెనర్జీ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేత రాహుల్ సిన్హా కూడా కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఎంతో తమకు ఎలాంటి అవగాహన ఒప్పందం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ మాత్రమే పోరాడుతోందన్నారు.
ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశం ఫొటో సెషన్ మత్రమే: నడ్డా
పట్నాలో జరిగిన ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశం ఫొటో సెషన్ మత్రమే అని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కుటుంబ, బుజ్జగింపు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు బదులు.. అభివృద్దిని కోరుకునే ప్రజలు కచ్చితంగా బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతివ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీపైనా.. నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్చిలో రాహుల్ బ్రిటన్ పర్యటనను గుర్తుచేసిన నడ్డా.. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
200 ఏళ్ల పాటు భారత్‌ను పాలించిన దేశానికి వెళ్లి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరడం విడ్డురమన్నారు నడ్డా. నాన్నమ్మ ఇందిరా గాంధీ పరిపాలనను మరిచిపోయారా అంటూ రాహుల్‌ను ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించి దాదాపు 1.88 లక్షల మందిని ఇందిరా గాంధీ జైల్లో పెట్టించారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం సురక్షితంగానే ఉందని.. మిమ్మల్ని మీరు రక్షించుకోండని కాంగ్రెస్ నేతలకు సూచించారు నడ్డా. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా.. కేరళలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన నడ్డా.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజధాని తిరువనంతపురంలో ఆదివారం ఈ సభ జరిగింది.
ఇవీ చదవండి:
'మోదీ ఓడేది లేదు.. రాహుల్‌కు పెళ్లి అయ్యేది లేదు'.. కర్ణాటక మాజీ సీఎం బొమ్మై కామెంట్స్
'మణిపుర్ అంశంపై రోజూ ప్రధానితో చర్చ.. శాంతి పునరుద్ధరణకు నిరంతర యత్నం!'