గంగానది పరీవాహక ప్రాంతంలో పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ వాతావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శికి- జల్‌శక్తి ఆధ్వర్యంలోని 'స్వచ్ఛ గంగ జాతీయ మిషన్ (ఎన్‌ఎంసీజీ)' కార్యనిర్వాహక సంచాలకుడు గత నెల (ఏప్రిల్) ఒకటో తేదీన లేఖ రాశారు. హరిద్వార్ సమీపంలో చట్టబద్ధతలేని గనుల తవ్వకాలవల్ల గంగానది ఉనికికే ముప్పు ఏర్పడనుందని, ఇప్పటికే కొన్ని గనులకు ఇచ్చిన అనుమతులను సైతం ఉపసంహరించాలని లేఖలో గట్టిగా సిఫార్సు చేశారు. ముఖ్యంగా కుంభమేళా జరిగే ప్రాంతంలో చారిత్రక, పర్యావరణ, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. అయితే కుంభమేళా ప్రారంభమైనప్పుడే ఈ లేఖ రాయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం కాక మానదు.
అమలు కాని హామీలు
మాత్రి సదన్‌కు చెందిన స్వామి శివానంద సరస్వతి, బ్రహ్మచారి ఆత్మబోధానంద అనే ఇద్దరు సాధువులు అక్రమంగా సాగుతున్న గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తూ హరిద్వార్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్‌ఎంసీజీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాజన్ మిశ్రా స్వామి శివానందకు రాసిన వ్యక్తిగత లేఖలో దీక్షను విరమించాలని కోరారు. నిరసనకు దిగిన సాధువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు హామీనిచ్చారు. అంతకుముందు లేఖలో మాత్రి సదన్ లేవనెత్తిన అంశాలకు జవాబిస్తూ తాము ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టుకూ అనుమతులివ్వలేదని స్పష్టం చేశారు. మాత్రి సదన్ ఆధ్వర్యంలో 1998 నుంచి ఈ తరహా నిరాహారదీక్షలు 65 జరిగాయి. అధికారులు ఎన్నో హామీలూ ఇచ్చారు. కానీ, అందులో చాలాభాగం అమలుకు నోచుకోలేదు. స్వామి నిగమానంద్, స్వామి జ్ఞాన స్వరూప సనంద, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్‌గా ప్రఖ్యాతి గాంచిన జీడీ అగర్వాల్ వంద రోజులకు పైగా దీక్ష నిర్వహించి.. ప్రాణాలు వదిలారు. స్వామి గోకులానంద గనుల మాఫియా చేతిలో హత్యకు గురయ్యారు. ఈ పోరాటంలో రాజకీయ నేతలు, అధికారులు, గనులమాఫియా, కార్పొరేట్లు మాత్రి సదన్‌కు వ్యతిరేకంగానే వ్యవహరించడం గమనార్హం. నదీ పరిరక్షణకు మాత్రి సదన్ ఏం చేసిందనేదీ చర్చనీయాంశమే.
'నమామి గంగే' కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 20 వేల కోట్ల రూపాయల నుంచి సింహభాగం నిధులు మురుగునీటి నిర్వహణ ప్లాంట్ల నిర్మాణానికే వెచ్చిస్తున్నారు.వీటిద్వారా రోజూ సుమారు 119 కోట్ల లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయడం లక్ష్యం. వాస్తవానికి గంగా నది పొడవునా ఉత్పన్నమవుతున్న మురుగునీరు రోజూ 290 కోట్ల లీటర్లు. అంటే నదిలో నిత్యం చేరుతున్న మురుగును పూర్తిస్థాయిలో నిర్వహించే ప్రణాళిక సైతం కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు. అటువంటప్పుడు గంగానదిని ఎలా శుద్ధి చేయగలుగుతారు? శుద్ధి చేసినా చేయకపోయినా మురుగునీటిని గంగా నదిలో మాత్రం కలపరాదని, ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగించాలని జీడీ అగర్వాల్ తరచూ చెప్పేవారు.
ప్రస్తుతం గంగా నది పొడవునా సాధువులు, యాత్రికుల స్నానపానాదులకు అవసరమైనంత నీటి ప్రవాహం ఉందని ప్రభుత్వం అంటోంది. నిజానికి 2019లో తెహ్రీ, హరిద్వార్, బిజ్నోర్, నరోరాలలోని ఆనకట్టల ద్వారా నీటిని విడుదల చేయకపోతే ప్రయాగ్‌రాజ్ వద్ద పవిత్ర స్నానం ఆచరించేందుకు తగినంత నీరు ఉండేది కాదు. 2019 జనవరి 15 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు 'అర్ధ్ కుంభ్' సందర్భంగా గంగానది శుద్ధీకరణ జరిగినా- అది తాత్కాలికమైనదే. గంగా పరీవాహక ప్రాంత ప్రజలకోసం- నదిని ప్రక్షాళించేందుకు ప్రభుత్వం శాశ్వతమైన ప్రణాళికను ఎందుకు రూపొందించదనేదే ప్రశ్న.
ఆనకట్టలతో ముప్పు
గంగా నదిలో ఏడాది పొడవునా కనీస ప్రవాహ స్థాయి ఉంటేనే ప్రక్షాళన సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. గంగానదిలోని నీటిలో ఉండే బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్... ప్రమాదకరమైన ఈ-కొలీ బ్యాక్టీరియాను నాశనం చేస్తుందనేది వారి వాదన. అందుకే పలువురు శాస్త్రవేత్తలు ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించారు. గతంలో సుప్రీంకోర్టు నియమించిన రవిచోప్రా కమిటీ సైతం ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ఆనకట్టలవల్ల విధ్వంసం తీవ్రస్థాయిలో పెరుగుతుందని వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
జీడీ అగర్వాల్ మరణానికి కొన్ని గంటలముందు కేంద్ర ప్రభుత్వం గంగానదిలో 30శాతం ప్రవాహానికి అనుమతించింది. ఐఐటీ కన్సార్షియం ఇచ్చిన నివేదిక చేసిన సూచనకంటే అది తక్కువ పరిమాణమే. ఏదేమైనా గంగానదిపై ఆనకట్టలను నిర్వహించే అలక్‌నంద హైడ్రోపవర్, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ వంటి ప్రైవేటు కార్పొరేషన్లు ఈ స్థాయి ప్రవాహానికి సైతం ఆమోదించడంలేదు. ఎందుకంటే అది వారి విద్యుదుత్పత్తిని తగ్గించి, ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుంది. నమామి గంగే కింద ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణ పనులవల్ల ప్రయోజనం లేకపోగా, పర్యాటకుల సంఖ్య పెరిగి కాలుష్యం మరింతగా పెచ్చరిల్లనుంది. జీడీ అగర్వాల్ తన చివరి దీక్ష సందర్భంగా ప్రభుత్వం గంగా నది ప్రక్షాళకు ఏమీ చేయదని, అందుకు సంబంధించిన ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పెంచుకొనేందుకే ప్రాధాన్యమిస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
-సందీప్ పాండే (రామన్ మెగసెసే పురస్కార గ్రహీత)
ఇదీ చదవండి : ఏమిటీ ముంబయి మోడల్.. కరోనా వేళ ఏం చేసింది?