Online Gaming Karnataka High Court: ఆన్లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అశ్వతి, జస్టిస్ క్రిష్ణ ఎస్. దీక్షిత్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆల్ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, గెలాక్టస్ ఫన్‌వేర్ టెక్నాలజీస్, ఇతర గేమింగ్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. వారి పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
సవరిస్తే అభ్యంతరం లేదు..
"ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఒకవేళ చట్టాన్ని సవరించి రాజ్యంగ పరిధిలో నిబంధనలను రూపొందిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు." అని ధర్మాసనం స్పష్టం చేసింది.
బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నేరపూరితమైనవని, వాటిని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం గతేడాది ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను పోలీస్(సవరణ) చట్టం, 2021లో పొందుపరిచింది. సైబర్ నేరాలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఈ నిబంధనలు తెస్తున్నట్లు అప్పట్లో తెలిపింది కర్ణాటక సర్కార్.
ఈ బిల్లు ఆమోదం పొందాక.. మొబైల్ ప్రీమియర్ లీగ్, డ్రీమ్ 11, గేమ్స్ 24x7 వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ నిషేధానికి గురయ్యాయి.
ఇదీ చూడండి: chinese apps ban: 54 చైనా యాప్‌లపై నిషేధం!