One Rupee Medicine For Poor: 'మానవసేవే మాధవసేవ' లాంటి సూక్తులు ఆయన్ను ఆలోజింపచేశాయి. కార్పొరేట్ వైద్యానికి నోచుకోని పేదలు, అభాగ్యులను చూసి ఆయన చలించారు. పేద రోగులకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

రూపాయికే వైద్యంతో పాటు ఔషధాలు అందిస్తూ.. ఒడిశా సంబల్పుర్లోని పేదలు, అనాథలు, అభాగ్యుల పాలిట ఆపద్భాందవుడిలా నిలుస్తున్నారు డాక్టర్ శంకర్ రామ్చందాని. పేదలకోసం ఏడాది క్రితమే సంబల్పుర్లోని బుర్లా పట్టణంలో 'వన్ రూపీ క్లినిక్' ప్రారంభించారు రామ్చందాని. ఇప్పటివరకు దాదాపు 7వేల మంది పేదలు, అనాథలకు వైద్యం చేశారు.

అందుకే క్లినిక్..
అయితే.. తాను రాసిచ్చిన మందులను పేద ప్రజలు కొనలేకపోతున్నారని గ్రహించిన రామ్చందాని.. ఇప్పుడు 'రూపాయికే మెడిసిన్' అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో లభించే మందులను కేవలం ఒక్క రూపాయికే పేదలకు అందిస్తున్నారు.

వీర్ సురేంద్ర సాయ్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రామ్చందాని.. ఖాళీ సమయాల్లో ఇలా పేదలకు వైద్యం, ఔషధాలు అందిస్తూ తన సేవాతత్పరతను చాటుతున్నారు. పేదలకు వైద్య సాయం చేయాలన్న తన తండ్రి కలను నెరవేర్చినందుకు తనకు సంతృప్తిగా ఉందని అంటున్నారు.
ఇదీ చూడండి: పెళ్లితో ఒక్కటైన ట్రాన్స్జెండర్ల జంట- ఇలా దేశంలోనే తొలిసారి!