దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగు చట్టాలపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. లోహ్రీ సందర్భంగా చట్టాల ప్రతులను లోహ్రీ మంటల్లో దహనం చేశారు. రాజధాని శివార్లలోని టిక్రీ, సింఘూ సరిహద్దు సహా పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఈ కార్యక్రమం నిర్వహించారు. సింఘూ సరిహద్దు వద్ద లక్ష ప్రతులను దహనం చేసినట్లు నిరసనకారులు వెల్లడించారు.
మరింత ఉద్ధృతం చేస్తాం..
"ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. ఈనెల 18న దేశం నలుమూలల నుంచి మహిళలు వచ్చి నిరసనల్లో పాల్గొంటారు. ఇకనుంచి నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు."
-దర్శన్ పాల్, రైతు సంఘం నేత
ఆ రోజు శపథం చేస్తాం..
ఈనెల 20న సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ ప్రకాశోత్సవాలను నిర్వహిస్తామని దర్శన్ పాల్ తెలిపారు. 'ఉద్యమాన్ని శాంతియుతంగా విజయం వైపు ముందుకు తీసుకువెళతామని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకు అంతా శపథం చేయాలని పిలుపునిచ్చాం' అని అన్నారు.
ఇదీ చదవండి : రెండు టీకాల్లో మనకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చా?